కోవిడ్ నుంచి కోలుకున్నారా ? ఏడాదిలో మళ్లీ రావొచ్చు-నిపుణుల తాజా హెచ్చరిక
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయ్యాక జనంలో రకరకాల అనుమానాలు, అపోహలు పెరిగిపోయాయి. ఎవరేం చెప్పినా అవునా అనుకునే పరిస్ధితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. దీంతో రకరకాల పుకార్ల మధ్యే కోవిడ్ బాధితులుగా మారుతున్న వారు, లక్షణాలు లేకపోయినా అనుమానాలతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా లేకపోలేదు. తాజాగా కోవిడ్ ఓసారి వచ్చి తగ్గాక కూడా మళ్లీ సోకుతుందా అన్న అంశంపై విస్తృతమైన చర్చ సాగుతోంది. దీనికి నిపుణులు చెప్తున్న సమాధానమిదే..
Recommended Video

కోవిడ్ ఓసారి తగ్గాక మళ్లీ వస్తుందా ?
కరోనా ఓసారి సోకిన తర్వాత రోగులు చికిత్స తీసుకుని కోలుకున్న తర్వాత మళ్లీ సోకుతుందా ? లేక తగ్గినట్లే తగ్గి మళ్లీ తిరగబెడుతుందా ? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే భారత్‌తో పాటు పలు దేశాల్లో ఇప్పటివరకూ లభించిన ఆధారాలను బట్టి ఓసారి కరోనా వచ్చి తగ్గాక మరోసారి సోకడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని నిర్ధారణ అయింది. కానీ ఆ అరుదైన సందర్భాలేంటననే విషయంలోనూ భిన్నవాదనలున్నాయి.

లాంగ్ కోవిడ్ అంటే ఏంటి ?
ఓసారి కరోనా లక్షణాలు బయటపడిన తర్వాత రోగి చికిత్స తీసుకుని కోలుకున్న తర్వాత మరోసారి దీర్ఘకాలంలో అది తిరగబెడితే దాన్ని లాంగ్ కోవిడ్‌గా చెప్పవచ్చని ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్ ఆపరేషన్స్ రీసెర్చ్ గ్రూప్ హెడ్‌గా ఉన్న డాక్టర్ ఎన్‌కే అరోరా వెల్లడించారు. ఇందులో అప్పటివరకూ లేని కొత్త లక్షణాలు కూడా కనిపించవచ్చని, ఇది ఆరు నెలల నుంచి ఏడాది లోపు ఎప్పుడైనా, ఎవరికైనా జరగవచ్చని ఆయన తాజాగా వెల్లడించారు. దీంతో ఈ లాంగ్ కోవిడ్‌పై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది.

యాంటీబాడీలు మాయం కాగానే మళ్లీ
కోవిడ్ లేదా ఏదైనా ఇతర వైరస్ సోకినప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు మానవ శరీరంలోకి యాంటీబాడీల్ని అభివృద్ధి చేస్తారు. అది వ్యాక్సినేషన్ ద్వారా కానీ మరే ఇతర మార్గాల్లో కానీ జరుగుతుంది. ఇలా ఓసారి మానవ శరీరంలో అభివృద్ది చెందిన యాంటీబాడీలు సహజంగా మూడు నుంచి తొమ్మిది నెలల పాటు ఆ శరీరంలో ఉంటాయి. ఓసారి అవి శరీరం వదిలివెళ్లగానే మళ్లీ వైరస్ దాడి చేసే అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇది అన్ని శరీరాల్లో ఒకేలా ఉండదని, వివిధ వ్యక్తుల్లో ఆరు నుంచి 12 నెలల్లోపు యాంటీబాడీలు వెళ్లిపోగానే కరోనా మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉంటుందని చెప్తున్నారు.

కరోనా తగ్గినా ఈ సమస్యలు మాత్రం తప్పవా ?
ఓసారి ఓ వ్యక్తికి కరోనా సోకి తగ్గిన తర్వాత కూడా మళ్లీ వైరస్ దాడి చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాగే దీంతో పాటు అలసట, శ్వాస సంబంధిత సమస్యలు, నరాల సంబంధిత లక్షణాలు కూడా ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే లాంగ్ కోవిడ్ విషయంలో రోగులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కోవిడ్ తగ్గిపోయిందని అంతా సర్దుకున్నట్లే అని రిలాక్స్ కావడానికి వీల్లేదని ఈ వాదనల సారాంశం. ఓసారి కోవిడ్ లక్షణాలు కనిపించాక కోలుకునేందుకు మూడు వారాల కంటే ఎక్కువ సమయం పడితే దాన్ని లాంగ్ కోవిడ్‌గా నిపుణులు చెప్తున్నారు. ఇది ఎప్పటివరకూ ప్రభావం చూపుతుందనే దానిపై నిర్దిష్టమైన డేటా లేనప్పటికీ దీర్ఘకాలం సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications