వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ వల్ల పిల్లలతో పాటు ప్రజాస్వామ్యానికి హాని.. ప్రైవసీ కంటే ఆర్థిక ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుంది : మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హౌజెన్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఫ్రాన్సెస్ హౌజెన్

ఫేస్‌బుక్‌కు సంబంధించిన వెబ్‌సైట్లు, యాప్‌లు పిల్లలకు హాని కలిగించడంతో పాటు విభేదాలకు కారణమవుతాయని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయని అమెరికా చట్టసభ సభ్యులతో ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఒకరు చెప్పారు.

మాజీ ప్రాడక్టు మేనేజర్ అయిన 37 ఏళ్ల ఫ్రాన్సెస్ హౌజెన్, క్యాపిటల్ హిల్‌లో జరిగిన విచారణలో ఫేస్‌బుక్ కంపెనీపై తీవ్ర విమర్శలు చేశారు.

దీంతో కంపెనీ నియమనిబంధనలపై లోతైన పరిశీలన జరపాలనే డిమాండ్లు ఫేస్‌బుక్ యాజమాన్యానికి ఎదురయ్యాయి.

ఈ విమర్శలను ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఖండించారు. కంపెనీ గురించి అసత్య ప్రచారాలు జరిగాయని అన్నారు.

''కంపెనీపై వచ్చిన చాలా ఆరోపణలు, అర్థం లేనివని'' తన ఉద్యోగులకు రాసిన లేఖలో జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. హానికరమైన కంటెంట్‌పై పోరాటం, పారదర్శకంగా పనిచేయడం ఇలాంటి ముఖ్యమైన అంశాల్లో మనం చేస్తోన్న ప్రయత్నాల పరంగా చూసుకుంటే ఇవన్నీ అర్థం లేని ఆరోపణలు అని ఆయన అన్నారు.

''భద్రత, మానసిక ఆరోగ్యం, ప్రజాశ్రేయస్సుపై ఫేస్‌బుక్ చాలా శ్రద్ధ తీసుకుంటుంది. మన పనిని, మన ఉద్దేశాలను తప్పుగా చూపించే ప్రచారం జరగడాన్ని చూడటం కష్టంగా ఉంది'' అని ఫేస్‌బుక్ పేజీలో బహిరంగ లేఖ రాశారు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్

ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్. తమకు నెలవారీ యాక్టివ్ యూజర్లు 270 కోట్ల మంది ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా తమ అనుబంధ ఉత్పత్తులైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను కూడా కోట్ల మంది వినియోగిస్తారని చెప్పింది.

వినియోగదారుల గోప్యతను కాపాడటంలో విఫలమవ్వడం, తప్పుడు సమాచార వ్యాప్తిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోకపోవడం లాంటి కారణాల వల్ల ఫేస్‌బుక్ అనేక విమర్శలను ఎదుర్కొంది.

ఫేస్‌బుక్‌కు సంబంధించిన అనేక అంతర్గత పత్రాలను తాను ఇటీవలే వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చినట్లు హౌజెన్ ఆదివారం సీబీఎస్ న్యూస్‌తో చెప్పారు.

ఆ పత్రాల ఆధారంగా చేసిన అధ్యయనంలో ఇన్‌స్టాగ్రామ్, అమ్మాయిల మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని వెల్లడైనట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

మంగళవారం చట్టసభల ముందు సాక్ష్యం చెప్పేందుకు హాజరైన హౌజెన్ ఇదే అంశంపై మాట్లాడారు. ''ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను మరింత సురక్షితంగా ఎలా చేయాలో ఫేస్‌బుక్ సంస్థకు తెలుసు. కానీ వారు అందుకు అవసరమైన చర్యలేమీ తీసుకోరు. ఎందుకంటే వినియోగదారుల భద్రత కన్నా ఆర్థిక ప్రయోజనాలకే వారు అధిక ప్రాధాన్యతనిస్తారు'' అని వివరించారు.

సంస్థ కార్యకలాపాలను విస్తృతంగా నియంత్రిస్తారని ఆమె మార్క్ జుకర్‌బర్గ్‌ను విమర్శించారు.

ఫేస్‌బుక్ సర్వీసులకు సోమవారం భారీ అంతరాయం కలగడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతరాయం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.

''సోమవారం ఫేస్‌బుక్ నిలిచిపోయింది. అలా ఎందుకు అయిందో నాకు తెలియదు. కానీ ఆ అంతరాయం ఏర్పడిన ఐదు గంటలకు పైగా కాలంలో... ఫేస్‌బుక్ వల్ల కలిగే విభేదాలు, ప్రజాస్వామ్యాన్ని అస్థిరపరిచే విధానాలు ఆగిపోయాయి. మహిళలు, అమ్మాయిలు కూడా తమ శరీరం గురించి చెడుగా భావించే ఆలోచనలను దూరంగా ఉన్నారు'' అని ఆమె వివరించారు.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎంతోమంది యువత గొప్ప అనుభూతిని, మంచి అనుభవాలను పొందారని... కానీ ఈ ఫ్లాట్‌ఫామ్ స్వభావాన్ని తప్పుగా చూపే పరిశోధన జరిగిందని జుకర్‌బర్గ్ లేఖలో పేర్కొన్నారు.

''మేం తయారు చేసే ప్రతీ ప్రాడక్టు సురక్షితమైనదిగా, పిల్లలకు మంచి చేసేలా ఉండేలా చూసుకోవడమే నాకు ముఖ్యమైనది'' అని జుకర్‌బర్గ్ అన్నారు.

సోమవారం తలెత్తిన అంతరాయం గురించి మాట్లాడుతూ ''ఈ ఇబ్బంది కారణంగా మా వినియోగదారుల్లో ఎంతమంది ఇతర పోటీ సర్వీసుల వైపుకు మళ్లారు... ఎంత ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నాం అనే అంశాలు మాకు ఆందోళన కలిగించలేదు. కానీ మా సర్వీసులపైనే ఆధారపడి వ్యాపారాలు చేసుకునే వారి గురించి, మా ఉత్పత్తుల ద్వారా కమ్యూనికేషన్ జరిపే వినియోగదారుల గురించి మేం చింతించాం'' అని అన్నారు.

ఫేస్‌బుక్ కంపెనీలో అత్యావశ్యకమైన మార్పుల కోసం రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు మంగళవారం ఏకమయ్యాయి. ఈ రెండు రాజకీయ పార్టీలు కలిసి ఒక అంశంపై కలిసి పనిచేయడం చాలా అరుదైన అంశం.

''ఈరోజు ఫేస్‌బుక్ స్వీయ ప్రయోజనాల వల్ల కలిగిన నష్టం, ఒక తరాన్ని వెంటాడుతుంది'' అని డెమొక్రాటిక్ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంథల్ అన్నారు.

''పొగాకు ఉత్పత్తుల్ని తయారు చేసే సంస్థలు, పొగాకు వాడకం వల్ల కలిగే హానిని దాచిపెట్టినట్లు... ఫేస్‌బుక్ కూడా ఇదే తరహా సత్యాలను కప్పిపెట్టింది'' అని వ్యాఖ్యానించారు.

తమ ఉత్పత్తులకు సంబంధించి అనేక అంశాలపై హౌజెన్ ఇచ్చిన సాక్ష్యాలను తాము అంగీకరించమని విచారణ అనంతరం ఒక ప్రకటనలో ఫేస్‌బుక్ పేర్కొంది. కానీ ఇంటర్నెట్‌కు సంబంధించి కఠిన నిబంధనలను రూపొందించడానికి ఇది సరైన సమయంగా తామూ అంగీకరిస్తునట్లు చెప్పింది.

''గత 25 ఏళ్ల నుంచి ఇవే ఇంటర్నెట్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. శాసన సభ్యులు తీసుకోవాల్సిన సామాజిక నిర్ణయాలను పారిశ్రామిక వేత్తల నుంచి ఆశించే బదులుగా, కాంగ్రెస్ ఈ అంశంపై దృష్టి సారించాలి. అందుకు ఇదే సరైన సమయం'' అని ప్రకటనలో పేర్కొంది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్

చివరకు ఏకతాటిపైకి వచ్చిన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు

ఉత్తర అమెరికా రిపోర్టర్ ఆంథోని జర్చర్ విశ్లేషణ

ఫేస్‌బుక్, దానివల్ల కలిగే ముప్పు గురించి కాంగ్రెస్‌లోని డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఏకాభిప్రాయానికి వచ్చారు.

సోషల్ మీడియా దిగ్గజమైన ఫేస్‌బుక్ చాలా పెద్ద సంస్థ, అత్యంత శక్తిమంతమైనది అని మంగళవారం విజిల్ బ్లోయర్ ఫ్రాన్సెస్ హౌజెన్ వాంగ్మూలం సందర్భంగా ఇరు రాజకీయ వర్గాల్లోని సెనెటర్లు వ్యాఖ్యానించారు.

దీన్ని నిర్ధారించే చాలా ఉదాహరణలను వారు పేర్కొన్నారు. జనవరి 6న, అమెరికా రాజధానిలో జరిగిన దాడులకు కారణమైన అతివాద భావాలను ఫేస్‌బుక్ కంపెనీ అల్గారిథమ్స్ ప్రేరేపించాయని డెమెక్రాట్ సభ్యుడు ఆమీ క్లోబుచర్ ఆందోళన చెందారు. సంప్రదాయక విధానాలపై ఫేస్‌బుక్ సెన్సార్‌షిప్ గురించి రిపబ్లికన్ నేత టెడ్ క్రూజ్ వ్యాఖ్యానించారు.

టీనేజ్ బాలికల మానసిక ఆరోగ్యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిరూపించే ఆధారాలపై ఇతరులు దృష్టి సారించారు.

పోటీ సంస్థలు, తమకు సంబంధించిన ఈ లోపాలను ఎత్తి చూపేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తాయని ఫేస్‌బుక్ అనుకుంటోంది. తమపై చెలరేగుతోన్న రాజకీయ వేడి కూడా దానంతట అదే తగ్గిపోతుందని భావిస్తోంది.

దీనిపై స్పందించేందుకు వారి ఎగ్జిక్యూటీవ్‌ల వద్ద కూడా పరిమిత సమయమే ఉంది. ఒకవేళ ఈ రాజకీయ వేడిని నివారించాలనుకుంటే... 1980లో బెల్ టెలిఫోన్ కంపెనీ పాటించిన విధానాన్ని ఫేస్‌బుక్ అనుసరించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Facebook harms democracy along with children,Priority over financial interests: Frances Houzen
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X