ముంబైలో ఫ్లెక్సీల కలకలం..హుటాహుటిన ఏక్ నాథ్ షిండేతో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి బీజేపీ, శివసేన (శిందే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి 231 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ రాష్ట్రంలో 133 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన (శిందే) 57 స్థానాలు, ఎన్సీపీ (ఎస్పీ) 41 స్థానాలను గెలుచుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలై పది రోజులవుతోంది. అయినా సీఎం అభ్యర్థపై స్పష్టత రావడం లేదు.
తన పాలన చూసే కూటమికి పట్టం కట్టారని సీఎం షిండే చెబుతున్నారు. దీంతో సీఎం అభ్యర్థి ఎవరు అవుతారనే ఉత్కంఠ నెలకొంది. సీఎంగా ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. పేరును అధికారికంగా ప్రకటించనప్పటికీ... ఎల్లుండి ఆజాద్ మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని మహాయుతి కూటమి ప్రకటించింది. ఎన్నికల ఫలితాల తర్వాత మహాయుతి కూటమికి చెందిన ముగ్గురు కీలక నేతలు ఢిల్లీ పెద్దలను కలిశారు. ఆ తర్వాత ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ సీఎం ఎవరనేది తేల్చుకోలేకపోయారు.

సరిగ్గా ఇటువంటి సమయంలోనే ముంబై విధుల్లో షిండే బొమ్మతో భారీ బ్యానర్లు, హోర్డింగ్ లు దర్శనమిచ్చాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేనే మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలంటూ ఆ బ్యానర్లపై పేర్కొన్నారు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన సీఎం రేసులో ఉన్న ఫడ్నవీస్ , ఏక్ నాథ్ షిండేతో భేటీ అయ్యారు.ఫలితాలు వచ్చిన తర్వాత వీరిద్దరు ఫడ్నవీస్, షిండే భేటీ కావడం ఇదే మొదటిసారి. ఇప్పటికే వీరు ఓ ఒప్పందానికి వచ్చినట్టు సమాచారం అందుతోంది. దీనిపై బుధవారం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications