చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచినీటి ట్యాంకులో మలం: ‘‘నా చేతితోనే పిల్లాడికి విషం ఇచ్చినట్లు అనిపించింది’’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాండిచెల్వి

తమిళనాడు పుదుక్కోటై జిల్లాలోని ఇరాయుర్ గ్రామంలో దళితులు జీవించే ప్రాంతంలోని వాటర్ ట్యాంక్‌లో కొందరు మనుషుల మలాన్ని కలిపేశారు. ఆ నీటిని తాగిన చాలా మంది చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు.

ఇప్పటివరకు ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించలేదు. అయితే, దీనిపై విచారణ చేపడుతున్నప్పుడు జిల్లా కలెక్టరుకు ఇలాంటి మరిన్ని విషయాలు తెలిశాయి.

దళితులను ఆలయాల్లోకి అనుమతించకపోవడం, వారికి టీ ఇచ్చే కప్పులను విడిగా ఉంచడం లాంటి అంటరాని చర్యలకూ గ్రామస్థులు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటికి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు.

ఇక్కడి దళితులు, ఇతర వర్గాల మధ్య సంబంధాలను గాడిన పెట్టేందుకు జిల్లా పరిపాలనా యంత్రాంగం చర్చలు జరుపుతోంది.

అయితే, ఇరాయుర్‌లో ఏం జరుగుతోంది, బాధితులు ఏం చెబుతున్నారు? లాంటి అంశాలు తెలుసుకునేందుకు బీబీసీ అక్కడకు వెళ్లింది.

ఇరాయుర్

మలం కలిపారని ఎలా తెలిసింది?

పుదుక్కోటైకు 20 కి.మీ. దూరంలో ఇరాయుర్ ఉంటుంది. ఈ గ్రామంలో భిన్న కులాలకు చెందిన 300 కుటుంబాలు జీవిస్తున్నాయి.

మేం గ్రామంలోకి వెళ్లిన వెంటనే, ఎక్కడ చూసినా పోలీసులే కనిపించారు. దళితులు ఎక్కువగా జీవించే ప్రాంతాలతోపాటు అగ్రవర్ణాలు జీవించే ప్రాంతంలోని ప్రజలు కూడా గ్రామానికి అధికారులు రావడంపై మాట్లాడుకుంటున్నారు.

ఇరాయుర్‌ దళిత ప్రాంతంలోని పది వేల లీటర్ల వాటర్ ట్యాంకు నుంచి వచ్చిన నీటిని తాగిన పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. తన నాలుగేళ్ల కుమారుడు కూడా అనారోగ్యానికి గురయ్యారని పాండిచెల్వి చెప్పారు.

''రెండు రోజులైనా బాబుకు జ్వరం తగ్గకపోవడంతో మేం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాం. అతడికి వాంతులు, విరేచనాలు అయ్యేవి. ఏడు రోజుల వరకు పరిస్థితి అలానే ఉంది.

మా గ్రామంలో చాలా మంది పిల్లలకు జ్వరం, డయేరియా వచ్చాయి. ఒకరి తర్వాత ఒకరుగా అందరూ ఆసుపత్రిలో చేరారు. వెంటనే గ్రామంలోని మంచి నీళ్ల ట్యాంకును చూడమని వైద్యులు చెప్పారు. అప్పుడే నీటిలో మనుషుల మలం కలిపినట్లు వెలుగులోకి వచ్చింది’’అని కంటి నిండా నీళ్లతో ఆమె వివరించారు.

పాండిచెల్వితోపాటు చాలా మంది బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేయడంతో జిల్లా పరిపాలనా విభాగం ఇక్కడి నీటికి పరీక్షలు నిర్వహించింది. అప్పుడు నీటిలో మలం కలిపినట్లు నిర్ధరణ అయ్యింది. వెంటనే నీటిని శుభ్రం చేశారు.

''ఆ మలం కలిపిన నీటిని నేను మా బాబుకు ఇచ్చారు. అసలు నా చేతితో నేనే విషం ఇచ్చినట్లు అనిపించింది. వారు ఇప్పుడు ట్యాంకు శుభ్రం చేశారు. కానీ, ఇప్పటికీ ఆ నీటిని తాగాలంటే అసహ్యం వేస్తోంది. చాలా మంది ఇప్పుడు మా గ్రామ ప్రజలు మలం కలిపిన నీళ్లు తాగారని చెప్పుకుంటున్నారు. ఇది ఇప్పటితో ముగిసిపోయేది కాదు. ఇలాంటివి మళ్లీ జరుగుతాయేమోనని భయం వేస్తోంది’’అని పాండిచెల్వి వివరించారు.

సింధూజ

''గుడిలోకి కూడా రానివ్వరు..’’

పది రోజుల తర్వాత పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది. హాస్పిటల్‌లో వారం రోజులు గడిపిన ఒక బాలికతో మేం మాట్లాడాం.

ఇక్కడి స్థానిక ఆసుపత్రిలో ఐదుగురు పిల్లలు చేశారు. పెద్దవారిపైనా ఈ నీళ్లు ప్రభావం చూపించాయి. మొత్తంగా పది మంది చిన్నారులు సహా 30 మంది అనారోగ్యానికి గురయ్యారని గ్రామస్థులు చెబుతున్నారు.

''మా గ్రామంలో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. ఇది చాలా దారుణం. అసలు నీటిలో మలాన్ని ఎవరు కలిపారో తాము గుర్తించడం కష్టమని అంటున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచాయి. అమృత మహోత్సవ్ వేడుకలను కూడా భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. కానీ, మాకు మాత్రం మలం కలిసిన నీళ్లు ఇస్తున్నారు. కుల అకృత్యాలకు మా గ్రామం ఒక ఉదాహరణ. ఎవరైనా పెద్ద రాజకీయ నాయకుడి ఇంటి ముందు మల విసర్జన చేస్తే వెంటనే అతడిని గుర్తిస్తారు. కానీ, మేం మాత్రం ఆ మలం కలిసిన నీళ్లను తాగాం. మేం సాధారణ పౌరులం కాబట్టి దర్యాప్తు కూడా వేగంగా జరగడం లేదు’’అని గ్రామానికి చెందిన సింధూజా వ్యాఖ్యానించారు.

ఇరాయుర్

ఈ ఘటన తర్వాత జిల్లా కలెక్టర్ కవిత రాము ఇరాయుర్‌కు వచ్చారు. అప్పుడే స్థానికంగా టీ దుకాణాన్ని నడిపించే అగ్రవర్ణాలకు చెందిన మూకయ్య దళితులకు వేరే కప్పుల్లో టీ ఇస్తున్నట్లు తెలుసుకున్నారు. మరోవైపు అయ్యనార్ దేవాలయంలోకి కూడా తమను రానివ్వడంలేదని దళితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని తీసుకొని దేవాలయంలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించారు.

అయితే, దళితులు గుడిలోకి అడుగుపెట్టకూడదని దేవుడు పూనినట్లుగా గ్రామస్థులు చెబుతున్న సింగమ్మల్ అనే మహిళ చెప్పారు. వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దళితులను కలెక్టర్ గుడిలోకి తీసుకెళ్లారు.

మరోవైపు ఆ టీ దుకాణం యజమాని మూకయ్య, ఆయన భార్య మీనాక్షిలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరందరిపైనా ప్రజా హక్కుల పరిరక్షణ చట్టం (పీసీఆర్ఏ) కింద కేసులు నమోదుచేశారు.

ఆ గుడి గురించి సింధూజా మాట్లాడుతూ.. ''కలెక్టర్ వచ్చినప్పుడు, మేం అంతా గుడిలోకి వెళ్లాం. గత మూడు తరాలుగా ఆ గుడిలోకి వెళ్లేందుకు మేం ఎదురుచూశాం. ఇప్పుడు మా కల నెరవేరింది. ఇటీవల సమథ్తవ పొంగల్‌ను కూడా అందరితో కలిసి జరుపుకున్నాం. ఇప్పుడు మా గ్రామానికి పోలీసులు రక్షణ కూడా కల్పిస్తున్నారు. అయితే, ఆ మలం కలిపిన వారిని కూడా గుర్తించి, శిక్షించాలి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది’’ అని ఆమె చెప్పారు.

ఈ అంశంపై 59 ఏళ్ల సదాశివంతోనూ మేం మాట్లాడాం. గ్రామంలో అంటరానితనం ఇప్పటికీ కనిపిస్తోందని ఆయన చెప్పారు.

''నా చిన్నప్పుడు మా గ్రామంలోని అగ్రవర్ణాల పిల్లలు మా నాన్నను పేరు పెట్టి పిలిచేవారు. మమ్మల్ని వారు సమానంగా చూసేవారు కాదు. గుడిలోకి కూడా అనుమతించేవారు కాదు. కలెక్టర్ వల్లే మేం గుడిలోకి అడుగుపెట్టాం. అయితే, ఇప్పుడు మళ్లీ గుడిలోకి రానిస్తారో, రానివ్వరో తెలియదు. మా తరం ఇలాంటి అకృత్యాలను చాలా చూసింది. వచ్చే తరంలోనైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటికీ అంటరానితనం కొనసాగడం దారుణం’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ఇరాయుర్

''అలాంటివేమీ లేవు’’

ఇరాయుర్‌లో అంటరానితనం కొనసాగుతుందా? అనే తెలుసుకునేందుకు చాలా మంది వాలంటీర్లు వస్తున్నాయి. మరోవైపు రాజకీయ నాయకులు కూడా నిరసనలు చేపడుతున్నారు.

మేం అగ్రవర్ణ కులాలు ఉండే ప్రాంతానికి వెళ్లినప్పుడు చాలా మంది మాట్లాడటానికి నిరాకరించారు. అభిప్రాయాలు చెప్పి ఏం ఉపయోగం? అని వారు ప్రశ్నించారు. తమ గ్రామానికి ఇలా ప్రశ్నలు వేసేవారు రావడం తమకు నచ్చదని కొందరు మహిళలు చెప్పారు. మేం మళ్లీమళ్లీ వారి అభిప్రాయాలను కోసం ప్రశ్నించినప్పుడు మా రిపోర్టర్, ఫోటోగ్రాఫర్‌ను గ్రామస్థులు చుట్టుముట్టారు.

అగ్రవర్ణాల యువకులు మాట్లాడుతూ, ''మా గురించి ఎవరూ వార్తలు రాయడం లేదు. వచ్చినవారంతా బాధితులు ఎక్కడ ఉంటారని అడుగుతున్నారు. ఇప్పటివరకు మా రెండు వర్గాల మధ్య మంచి సంబంధాలు ఉండేవి. గుడిలోకి వెళ్లడంపైనా నిషేధం లేదు. వారు గుడి ద్వారం వరకు వచ్చి దేవుడిని దర్శించుకునేలా ఎప్పటినుంచో వెసులుబాటు ఉండేది’’అని వివరించారు.

గుడికి సంబంధించిన కొన్ని పనులు కేవలం దళితులతోనే చేయిస్తామని, ఇక్కడ అంటరానితనం లాంటిదేమీలేదని వారు చెబుతున్నారు.

అగ్రవర్ణాలకు చెందిన మహేశ్వరి మాతో మాట్లాడారు. ''ఎవరి కులమూ తక్కువని మేం చెప్పం. వారే తమది తక్కువ కులమని చెప్పుకుంటారు. దగ్గర్లోని అంగన్వాడీలో రెండు వర్గాల పిల్లలు కలిసే చదువుకుంటారు. ఒకే రోడ్డును మేం ఉపయోగిస్తాం. టీ షాపులో రెండు రకాల కప్పులు ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ కొందరిని అరెస్టు చేశారు. నిజానికి అలాంటిదేమీ జరగడం లేదు. దేవుడికి ప్రత్యేక పూజలు చేసేవారికి మాత్రమే మేం ప్రత్యేక కప్పులు వాడతాం. దాన్ని వారు అపార్థం చేసుకున్నారు’’అని ఆమె చెప్పారు.

''ఆ నీళ్ల ట్యాంకులో మలం ఎవరు కలిపారో మేం కూడా తెలుసుకోవాలని భావిస్తున్నాం. మా కులాల ప్రజలు అలా చేసుండరని మేం నమ్మతున్నాం. పోలీసులు ఆ పనిచేసిన వారెవరో కనిపెట్టాలి. అప్పుడు దళితుల కంటే మేమే సంతోషిస్తాం. ఇన్నేళ్లుగా ఇక్కడ ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఇప్పుడు ఏకంగా అరెస్టులు చేస్తున్నారు, అధికారులు వస్తున్నారు.. మాకు చాలా బాధగా అనిపిస్తోంది’’అని ఆమె వివరించారు.

ఇరాయుర్

ఆలస్యం ఎందుకు జరుగుతోంది?

ఇప్పటివరకు ఆ నీళ్ల ట్యాంకులో మలాన్ని కలిపిన వ్యక్తులను పోలీసులు గుర్తించలేదు. ఈ కేసుపై మేం ఎస్సీ వందిత పాండేతో మాట్లాడేందుకు ప్రయత్నించాం. కానీ, ఆమె నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. నిందితులను గుర్తించేందుకు 11 మందితో ఒక కమిటీ ఏర్పాటుచేసినట్లు తిరుచిరాపల్లి డీఐజీ శరవణ సుందర్ చెప్పారు. మరోవైపు ఇరాయుర్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

అయితే, దర్యాప్తులో చాలా జాప్యం చోటుచేసుకుంటోందని సామాజిక ఉద్యమకారుదు కధిర్ అన్నారు.

''దళితులను గుడిలోకి అనుమతించకపోవడం, వారికి విడిగా పాత్రలు పెట్టడం లాంటి వాటిపై చర్యలు తీసుకోవడం కాస్త ఉపశమనం కల్పించే అంశమే. అయితే, నీళ్లలో మలం కలపడం చాలా దారుణం. అసలు ఆ నిందితులను ఇప్పటివరకు గుర్తించలేదు. కావాలనే జాప్యం చేస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. మలం స్థాయిలు చూస్తుంటే ఒకరి కంటే ఎక్కువ మందే ఈ కుట్ర వెనుక ఉన్నట్లు అనుమానం వస్తోంది’’అని ఆయన వివరించారు.

మరోవైపు ఇలాంటి అకృత్యాల్లో నిందితులకు శిక్ష పడటం చాలా అరుదని కధిర్ చెప్పారు. ''సాధారణంగా దళితులపై అకృత్యాలు జరిగాయని మొదట ఫిర్యాదు నమోదుచేస్తారు. కానీ, శిక్షలు పడటం చాలా అరుదు. తమిళనాడులో గత ఏడేళ్లలో కేవలం 5 నుంచి 7 శాతం కేసుల్లోనే దోషులకు శిక్షలు పడ్డాయి. సమాచార హక్కు చట్టం దరఖాస్తులో ఈ విషయలు వెలుగుచూశాయి. అందుకే ఇరాయుర్ కేసుపై దర్యాప్తులో వేగం పెంచాలి. ఇక్కడ ఆలస్యం చేయడమంటే బాధితులకు అన్యాయం చేయడమే’’అని ఆయన చెప్పారు.

ట్యాంకు

''ఎవరూ మాట్లాడటం లేదు’’

అంటరానితనాన్ని కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ కవితా రాముతో మేం మాట్లాడాం.

''ఇరాయుర్ ఘటన తర్వాత వెంటనే మేం వాట్సాప్ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చాం. దీని ద్వారా ఎవరైనా అంటరానితనంపై ఫిర్యాదు చేయొచ్చు. ఇరాయుర్‌లో ప్రభుత్వ పథకాల ద్వారా అక్కడి పిల్లల చదువుకు రుణాలు ఇవ్వడం, ఆరోగ్య సదుపాయాలు, వ్యాపారాలు పెట్టుకొనేలా ప్రోత్సహించడం లాంటివి చేస్తున్నాం. మేం రెండు వర్గాలతోనూ చర్చలు కూడా జరుపుతున్నాం. ఇటీవల జాతర కూడా అందరూ కలిసి జరుపుకొనేలా ఏర్పాటుచేశాం. పుదుక్కొట్టైలో మాత్రమే అంటరానితనం ఉందని భావించకూడదు. ఇప్పుడు ఒక గ్రామంలో ఇది బయటపడింది అంతే, ఇలాంటివి పునరావృతం కాకుండా వెంటనే మేం ఒక నంబరును అందుబాటులోకి తీసుకొచ్చాం’’అని ఆమె చెప్పారు.

నిందితులను గుర్తుపట్టడంపై ఆమె స్పందిస్తూ.. ''ఆ గ్రామంలో సీసీటీవీ లేదు. కాబట్టి నిందితులను గుర్తుపట్టడం కష్టం అవుతోంది. దర్యాప్తు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేశాం’’అని ఆమె చెప్పారు.

బీబీసీ

ఈ ఘటన ఏం సందేశం ఇస్తోంది?

ఇప్పటికీ రాష్ట్రంలో భిన్న రూపాల్లో అంటరానితనం కొనసాగుతోందని చెప్పేందుకు తాజా ఘటన ఉదాహరణ అని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్‌కు చెందిన లక్ష్మణన్ చెప్పారు. ఆయన అంటరానితనంపై పరిశోధన చేపట్టారు.

''ఆరోగ్య సేవలు, విద్య, రోడ్డు సదుపాయాలు, మంచి నీటి పంపిణీలో తమిళనాడు చాలా ముందుంటుంది. కానీ, సామాజిక మార్పుల విషయంలో ఇక్కడ చాలా వెనుకబాటు కనిపిస్తుంది. తాజా ఘటన కూడా అదే చెబుతోంది. ముందు ప్రజల మనసులో మార్పు రావాలి’’అని ఆయన చెప్పారు.

''కొన్ని గ్రామాల్లో దళితుల పిల్లలతో మరుగుదొడ్లు కడిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా దారుణం’’అని ఆయన వివరించారు.

''కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో దళితులపై అకృత్యాలు పెరిగాయని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. 2020లో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్(పీసీఆర్) చట్టం కింద 1274 కేసులు నమోదయ్యాయి. 2021లో ఇవి 1377కు పెరిగాయి. ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తేనే, సమాజంలో మార్పు వస్తుంది’’అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Faeces in fresh water tank: 'It felt like I poisoned the child with my own hand'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X