• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Fake Currency: పెద్ద నోట్లను రద్దు చేసి ఆరేళ్లయినా ఇంకా నకిలీ కరెన్సీ ఎందుకు ఉంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

2016లో పెద్దనోట్లను నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. నోట్ల రద్దుకు ఆనాడు ప్రభుత్వం చెప్పిన కారణాల్లో నకిలీ కరెన్సీ నోట్లను అడ్డుకోవడమూ ఒకటి.

అయితే, రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తాజా నివేదికను పరిశీలిస్తే మార్కెట్‌లో నకిలీ కరెన్సీ నోట్లు పెరిగాయని స్పష్టం అవుతోంది.

గత ఏడాదితో పోల్చినప్పుడు రూ.500 నోట్లలో నకిలీ నోట్లు 101.9 శాతం పెరిగాయని, రూ.2,000 నోట్లలో 54.16 శాతం పెరుగుదల కనిపించిందని వార్షిక నివేదిక(2021-22)లో ఆర్బీఐ వెల్లడించింది.

బ్యాంకింగ్ రంగం గుర్తించిన మొత్తం ఫేక్ నోట్లలో 6.9 శాతం ఆర్బీఐ వద్ద బయటపడితే, 93.1 శాతం ఇతర బ్యాంకులు గుర్తించాయి.

ఆర్బీఐ నివేదికలో వెల్లడించిన నకిలీ నోట్లలో కేవలం బ్యాంకుల దగ్గర బయటపడిన నకిలీ నోట్లు మాత్రమే ఉన్నాయి. పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది పట్టుకున్న నకిలీ నోట్లను దీనిలో ప్రస్తావించలేదు.

2020లో రూ.92 కోట్లు విలువైన 8,34,947 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. 2019లో రూ.25 కోట్ల విలువైన 2,87,404 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

నకిలీ కరెన్సీ నోట్లు

ఫేక్ నోట్లు ఎందుకు పెరుగుతున్నాయి?

ఈ విషయంపై దిల్లీలోని జేఎన్‌యూ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ మాట్లాడారు. ఎకనమిక్స్‌లో ఆయనకు మూడు దశాబ్దాల అనుభవముంది. ''ద బ్లాక్ ఎకానమీ ఆఫ్ ఇండియా’’ పేరుతో ఆయన ఒక పుస్తకాన్ని కూడా రాశారు.

''నకిలీ నోట్ల బిజినెస్‌లో చాలా లాభం ఉంటుంది. ఒక నోటును ముద్రించేందుకు ఆర్బీఐకి రూ.2.5 నుంచి రూ.3 వరకు ఖర్చు అవుతుంది. ఫేక్ నోట్లు తయారుచేసేవారికి రూ.10 ఖర్చు అయినా.. రూ.490 ప్రాఫిట్ వస్తుంది’’అని ఆయన చెప్పారు.

ఫేక్ నోట్ల సంఖ్య పెరగడానికి ఆధునిక టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి రావడమూ ఒక కారణమని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అన్నారు.

''ఫేక్ నోట్లకు కళ్లెం వేయడం చాలా కష్టం. ఎందుకంటే, ప్రస్తుతం అందుబాటులోనున్న టెక్నాలజీతో నకిలీ నోట్లు తయారుచేయడం చాలా తేలిక. పెద్దనోట్ల రద్దుతో నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయలేమనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ నకిలీ నోట్ల ముద్రణలో దేశ వ్యతిరేక శక్తులకు సంబంధం ఉంటుంది. ఆధునిక టెక్నాలజీతో వారు కూడా అప్‌డేట్ అవుతుంటారు’’అని ఆయన వివరించారు.

నకిలీ నోట్లకు కళ్లెం వేయడమూ పెద్దనోట్ల రద్దుకు ఒక కారణమనే నాటి ప్రభుత్వ వాదనతో అరుణ్ విభేదించారు. ''అదొక అపోహ మాత్రమే’’అని ఆయన వ్యాఖ్యానించారు.

నకిలీ కరెన్సీ నోట్లు

ఆర్బీఐ నివేదికను ఎలా చూడాలి?

మార్కెట్‌లో ఉన్న వాటితో పోలిస్తే, బ్యాంకింగ్ లేదా భద్రతా సంస్థల సిబ్బంది పట్టుకుంటున్న నకిలీ నోట్లు చాలా తక్కువని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ చెప్పారు. కేవలం మూడు నుంచి నాలుగు శాతం నోట్లు మాత్రమే అధికారుల చేతి వరకు వస్తాయని ఆయన వివరించారు.

''అధికారిక గణాంకాలతో మార్కెట్‌లో ఎన్ని నకిలీ నోట్లు ఉన్నాయో ఒక అవగాహనకు రాకూడదు. ఆ నివేదికలో కనిపించేవి చాలా తక్కువ. వాస్తవానికి ఈ సమస్య చాలా పెద్దది. ఒక్కోసారి నివేదికలో చెప్పే దానికంటే 30 రెట్లు లేదా 50 రెట్లు ఎక్కువగా నకిలీ నోట్లు మార్కెట్‌లో ఉండొచ్చు’’అని ఆయన చెప్పారు.

''ఒకవేళ మూడు శాతం నోట్లను బ్యాంకులు పట్టుకుంటే, మిగతావి మార్కెట్‌లో చెలామణీలోనే ఉంటాయి. నిజానికి తమ దగ్గరున్నవి నకిలీ నోట్లో లేదా మంచి నోట్లో సామాన్యులకు తెలియదు కూడా’’అని అరుణ్ కుమార్ వివరించారు.

''చెలామణీలో నుంచి ఈ నకిలీ నోట్లను తొలగించడం చాలా పెద్ద సమస్య. ఫేక్ నోట్లు ఉన్నాయని వార్తలు వచ్చినప్పుడు.. ప్రజలు ఈ నోట్లను మొత్తంగా తీసుకోవడం మానేస్తారు. దీంతో పరిస్థితులు మరింత దిగజారుతాయి. నకిలీ నోట్ల సంఖ్య పెరిగినప్పుడు కరెన్సీ విశ్వసనీయత కూడా దెబ్బ తింటుంది’’అని ఆయన అన్నారు.

నకిలీ కరెన్సీ నోట్లు

''చాలా తేలిక’’

ఎప్పటికప్పుడే నకిలీ నోట్లను ముద్రిస్తున్న ప్రింటింగ్ ప్రెస్‌లపై అధికారులు దాడులు చేసినట్లు వార్తలు వస్తుంటాయి. ఈ ఘటనలకు సంబంధించి చాలా అరెస్టులు కూడా చోటుచేసుకుంటాయి. మరోవైపు ఫేక్ ప్రింటింగ్ యంత్రాలతోపాటు కలర్ ప్రింటర్ల సాయంతోనూ నకిలీ నోట్లను ముద్రిస్తుంటారు.

బ్యాంకు నోట్ల విశ్వసనీయతను పెంచేందుకు, నకిలీ నోట్లకు కళ్లెం వేసేందుకు రిజర్వు బ్యాంకు ఎప్పటికప్పుడే కొత్త చర్యలను తీసుకుంటోంది. దీని వల్ల నకిలీ నోట్లు ముద్రించేవారు ఈ కొత్త మార్పులకు మారడానికి సరికొత్త టెక్నాలజీ, మరింత పెట్టుబడి అవసరం అవుతుంది.

నకిలీ కరెన్సీ నోట్లు

ముఖ్యంగా వాటర్ మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, సీక్రెట్ ఇమేజ్, మైక్రో లెటెరింగ్, సీల్, ఐడెంటిఫికేషన్ మార్క్ తదితర ఫీచర్లలో ఆర్బీఐ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది.

మరోవైపు నకిలీ నోట్లు గుర్తించేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆర్బీఐ ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపడుతోంది.

అయినప్పటికీ ఫేక్ నోట్ల సమస్య బ్యాంకింగ్ వ్యవస్థను వెంటాడుతూనే ఉంది.

''టెక్నాలజీ మెరుపడేకొద్దీ ఆర్బీఐ కొత్త మార్పులను తీసుకొస్తుంది. అయితే, కొత్త టెక్నాలజీతో ఫేక్ నోట్లు ముద్రించే వారి పని కూడా సులువవుతోంది. ఆర్బీఐ కొత్త చర్యలతో నకిలీ నోట్ల సమస్యకు కళ్లెం పడుతుందని మనం చెప్పలేం. ఎందుకంటే అన్ని సెక్యూరిటీ ఫీచర్లనూ ఇప్పుడు కాపీ కొట్టేస్తున్నారు’’అని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ చెప్పారు.

పరిష్కారం ఏమిటి?

ఈ నకిలీ నోట్ల సమస్యకు ఎలా పరిష్కారం దొరుకుతుంది?

''ఈ సమస్యను పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాదు. అయితే, చెలామణీలో నకిలీ నోట్ల సంఖ్యను మనం తగ్గించొచ్చు’’అని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ చెప్పారు.

అయితే, ఈ విషయంలో బ్యాంకులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ''ఫేక్ నోటు కనిపించిన వెంటనే మళ్లీ మార్కెట్‌లోకి అది రాకుండా చర్యలు తీసుకోవాలి’’అని ఆయన అన్నారు.

ఫేక్ నోట్లను గుర్తించడం కూడా కష్టం కావడంతో సామాన్యులు కూడా ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రభుత్వం ఏం అంటోంది?

నకిలీ నోట్లను ముద్రించే అక్రమ నెట్‌వర్క్‌లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భద్రతా సంస్థలు నిఘా పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మార్కెట్‌లోకి ఈ నోట్లు ఎలా వస్తున్నాయి? నేరస్థులు వీటిని ఎలా ముద్రిస్తున్నారు? లాంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు వివరిస్తోంది.

భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 489(ఏ-ఈ) ప్రకారం.. నకిలీ నోట్లను ముద్రించడం నేరం. మరోవైపు అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నకిలీ నోట్ల స్మగ్లింగ్, తయారీలను అక్రమ చర్యలుగా పేర్కొన్నారు.

ఈ నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర హోం శాఖ ఎఫ్ఐసీఎన్ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటుచేసింది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా టెర్రర్ ఫండింగ్ అండ్ ఫేక్ కరెన్సీ సెల్ (టీఎఫ్ఎఫ్‌సీ) విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఫేక్ నోట్లపై దర్యాప్తు బాధ్యతలను టీఎఫ్ఎఫ్‌సీ చూసుకుంటుంది.

నకిలీ నోట్లకు కళ్లెం వేసేందుకు ఆధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దులపై పటిష్ఠమైన నిఘా పెట్టడం, నౌకాశ్రయాలు, తీర ప్రాంతాల్లో గస్తీ కాయడం లాంటి చర్యలను కేంద్రం తీసుకుంటోంది.

నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు బంగ్లాదేశ్‌తోనూ భారత్ ఒక ఒప్పందం కుదర్చుకుంది. మరోవైపు నకిలీ నోట్లను గుర్తించేందుకు, ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు విషయంలో బంగ్లాందేశ్, నేపాల్‌లలోని పోలీస్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Fake Currency: Why is there still counterfeit currency six years after the cancellation of large denomination notes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X