కోవిడ్ మృతుల కుటుంబాలకు ఫించన్... కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం...
కోవిడ్ మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వారికి ఫించన్ అందించనున్నట్లు ప్రకటించింది. ఇంట్లో సంపాదించే వ్యక్తి కోవిడ్ బారినపడి మృతి చెందిన కుటుంబాలకు ఈ లబ్ది చేకూరనుంది. ఉద్యోగి రోజువారీ వేతనంలో 90 శాతం మొత్తాన్ని ఆ కుటుంబానికి ప్రభుత్వం ఫించనుగా అందించనుంది. గతేడాది మార్చి 24 నుంచి నుంచి మార్చి 24,2022 వరకు ఈ పథకం వర్తిస్తుంది.
Recommended Video
కోవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా EDLI(Employees Deposit Linked Insurance Scheme) పథకం కింద వర్తించే భీమా ప్రయోజనాలపై కీలక నిర్ణయం తీసుకుంది. గరిష్ట భీమా మొత్తాన్ని రూ .6 లక్షల నుంచి రూ .7 లక్షలకు పెంచింది.కనీస భీమా మొత్తాన్ని రూ .2.5 లక్షలుగా పునరుద్ధరించింది. గతేడాది ఫిబ్రవరి 15 నుంచి వచ్చే మూడేళ్ల పాటు ఇది వర్తిస్తుంది.
సాధారణ,కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు కూడా లబ్ది చేకూరేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జారీ చేస్తుందని స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా 'పీఎం కేర్స్-ఫర్ చిల్డ్రన్' పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.దీని ద్వారా అనాథ పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేనాటికి వారి పేరిట రూ.10 లక్షల కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 18 ఏళ్ల వయసు నుంచి ఐదేళ్ల పాటు ప్రతీ నెలా వారికి స్టైఫండ్ అందిస్తుంది. పిల్లలకు 23 ఏళ్ల వయసు వచ్చాక ఆ కార్పస్ ఫండ్ మొత్తాన్ని వారికి అందిస్తారు. దాన్ని వ్యక్తిగత ఖర్చులకు,చదువులకు లేదా వృత్తిపరమైన అవసరాలకు.. ఎలాగైనా వాడుకోవచ్చు. ఈ పథకం ద్వారా అనాథ పిల్లలకు ఉచిత విద్య,ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షలు ఆరోగ్య భీమా అందించనున్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులకు విద్యా రుణాలపై వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. చదువులకు స్కాలర్‌షిప్స్ కూడా అందిస్తుంది.
దేశంలో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను,సంరక్షకులను కోల్పోయిన ఎంతోమంది చిన్నారులకు ఈ పథకం లబ్ది చేకూర్చనుంది. ఆంధ్రప్రదేశ్,కేరళ,తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఇదే తరహా పథకాలను ఇప్పటికే ప్రకటించాయి.












Click it and Unblock the Notifications