వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల ఆందోళనలు: ఆ ఎఫ్‌ఐఆర్‌లో గ్రెటా థన్‌బర్గ్ పేరు లేదన్న దిల్లీ పోలీసులు... ఎంతటి విద్వేషం ఎదురైనా రైతుల వైపే ఉంటానన్న గ్రెటా...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గ్రెటా థన్‌బర్గ్

దిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు సంబంధించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టుల విషయమై ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేశామని దిల్లీ పోలీసులు తెలిపారు. అయితే, ఇందులో పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ పేరు లేదని, ఆమెపై కేసు నమోదు చేసినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని వారు వివరణ ఇచ్చారు.

ఆందోళనల సందర్భంగా సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు నిఘా పెట్టారని, ఆందోళనల పేరుతో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్న 300కుపైగా ట్విటర్ ఖాతాలను గుర్తించారని దిల్లీ పోలీసు స్పెషల్ సీపీ (క్రైమ్) ప్రవీర్ రంజన్ చెప్పారు.

ఒక ఖాతా నుంచి పోస్ట్ అయిన ఓ 'టూల్ కిట్’ డాక్యుమెంట్ కూడా పోలీసుల దృష్టికి వచ్చిందని... ఇందులో 'ముందస్తు కార్యాచరణ ప్రణాళిక’ అనే ఓ అధ్యాయం ఉందని ఆయన అన్నారు.

''రైతుల ఆందోళనల సమయంలో ఎక్కడెక్కడ ఏం చేయాలనేది ఇందులో పేర్కొన్నారు. జనవరి 23న రైతుల ఆందోళనల గురించి భారీగా ట్వీట్లు చేయాలని, 26న దిల్లీ సరిహద్దుల వరకూ జరిగే ర్యాలీలో పాల్గొనాలని, మళ్లీ సరిహద్దులకు రావాలని ఉంది’’ అని ఆయన వివరించారు.

జనవరి 26న జరిగిన పరిణామాలు చూస్తుంటే, ఆ టూల్‌కిట్‌లో పేర్కొన్న విషయాలే అమలైనట్లు కనిపిస్తోందని ప్రవీర్ అన్నారు.

''ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని సమర్థించే పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ సంస్థ ఈ టూల్‌కిట్‌ను రూపొందించింది. దీన్ని ఇదివరకే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ తర్వాత డిలీట్ చేశారు’’ అని ఆయన చెప్పారు.

''ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ దిల్లీ పోలీసులు ఈ టూల్‌కిట్‌ను రూపొందించనవారిపై ఐపీసీ 124ఏ, 153, 153ఏ, 120బీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. విచారణను సైబర్ విభాగానికి అప్పగించాం. ఎఫ్‌ఐఆర్‌లో ఎవరి పేరూ పేర్కొనలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.

18 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్ పర్యావరణ ఉద్యమకారిణిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆమె స్వీడన్‌కు చెందినవారు. చిన్నారిగా ఉన్న సమయంలోనే పర్యావరణాన్ని కాపాడాలంటూ స్కూల్ మానేసి స్వీడన్ పార్లమెంటు బయట ఆందోళన చేసిన ఆమె... ప్రపంచవ్యాప్తంగా ప్రముఖురాలిగా మారారు.

2019లో గ్రెటాను టైమ్ మ్యాగజీన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. ఈ పురస్కారం దక్కినవారిలో అత్యంత పిన్నవయస్కురాలు గ్రెటానే.

దిల్లీలో రైతుల ఆందోళనలను సమర్థిస్తూ గ్రెటా థన్‌బర్గ్ చేసిన ట్వీట్లపై భారత్‌లో ప్రశంసలతోపాటు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి.

దిల్లీ పోలీసులు చెబుతున్న టూల్ కిట్ గురించి కూడా ఆమె ట్వీట్లు చేశారు.

దిల్లీ పోలీసులు

అయితే, ఎంత వ్యతిరేకత వచ్చినా, రైతుల ఆందోళనలకు తన మద్దతు కొనసాగుతుందని గ్రెటా ట్విటర్‌లో స్పష్టం చేశారు.

''నేను ఇప్పటికీ రైతులవైపే ఉన్నా. శాంతిపూర్వకంగా వారు చేస్తున్న ఆందోళనలను పూర్తిగా సమర్థిస్తున్నా. విద్వేషం, బెదిరింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలు ఎంతగా వచ్చినా, నా వైఖరి మారదు’’ అని ఆమె ట్వీట్ చేశారు.

అమెరికన్ పాప్ సింగర్ రిహనా కూడా రైతుల ఆందోళనలకు మద్దతుగా ట్వీట్ చేశారు.

అయితే, గ్రెటా, రిహనా ట్వీట్లను భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా వర్ణిస్తూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు.

భారత విదేశాంగ శాఖ కూడా ఇదే రీతిలో స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

''రైతుల ఆందోళనలను ఉపయోగించుకుని తమ ఎజెండా అమలు చేయించుకోవాలని కొన్ని శక్తులు తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించింది.

అయితే, గ్రెటా, రిహనా ట్వీట్లు చేసి రైతుల ఆందోళనల అంశంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేశారని అభినందిస్తున్నవారు కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Delhi Police say Greta Thunberg's name is not in the FIR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X