రైతుల నిరసన ప్రదేశంలో కలకలం... గాల్లోకి కాల్పులు జరిపిన అగంతకులు...
ఆదివారం(మార్చి 7) రాత్రి ఢిల్లీలోని సింఘూ బోర్డర్ వద్ద కాల్పుల కలకలం రేగింది. రైతులు నిరసన ప్రదర్శన చేస్తున్న చోట గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. నలుగురు వ్యక్తులు కారులో వచ్చి గాల్లోకి కాల్పులు జరిపారని... ఆ వెంటనే అక్కడినుంచి పారిపోయారని రైతులు చెప్తున్నారు.ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
సమాచారం అందిన వెంటనే హర్యానాలోని కుండ్లి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. దుండుగులు ఉపయోగించిన కారుకు పంజాబ్ నంబర్ ప్లేట్ ఉందని నిర్దారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం(మార్చి 8) దాదాపు 40వేల మంది మహిళలు ఆందోళనల్లో పాల్గొనడానికి సిద్దమైన తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

కాగా,గతేడాది నవంబర్ 25 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికీ పలుమార్లు కేంద్రం వారితో చర్చించినప్పటికీ అవేవీ సఫలం కాలేదు. తాత్కాలికంగా ఏడాదిన్నర పాటు ఆ చట్టాలను పక్కనపెట్టేందుకు కేంద్రం ముందుకొచ్చినప్పటికీ రైతులు అందుకు ఒప్పుకోలేదు. ఆ చట్టాలను రద్దు చేయాలన్న ఏకైక ఎజెండాతో వారు ఉద్యమిస్తున్నారు.
ఇప్పటికే రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగానూ పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అదే సమయంలో ఆ మద్దతుపై వివాదం కూడా చెలరేగింది. పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు రైతులకు మద్దతునివ్వడాన్ని సచిన్ టెండూల్కర్ లాంటి దేశీ సెలబ్రిటీలు తప్పు పట్టారు. మరికొందరు సెలబ్రిటీలు వారి మద్దతును స్వాగతించారు. ఇదే క్రమంలో టూల్ కిట్ వ్యవహారం తెరపైకి రావడం,పర్యావరణ కార్యకర్త దిశా రవి అరెస్ట్,ఆపై విడుదల వంటి పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ దాదాపు మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు... ఎన్నాళ్లయినా సరే అక్కడినుంచి కదిలేది లేదని చెప్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ సరిహద్దులను ఖాళీ చేసేది లేదంటున్నారు.












Click it and Unblock the Notifications