ఉత్తరాదిపై సూర్యప్రతాపం: వేడిమిని తట్టుకునేందుకు రైతులు ఇలా..!
ఓ వైపు దంచికొడుతున్న ఎండలు.. మరోవైపు లక్ష్యాన్ని సాధించాలన్న కసి. గత కొన్ని నెలలుగా కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాతావరణం ఎలా ఉన్నప్పటికీ వారు సాధించాలనుకున్న లక్ష్యం వైపే అడగులు వేస్తూ ముందుకు వెళుతున్నారు తప్ప ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఇక ఢిల్లీకి వెళ్లే ప్రధాన రహదారుల వెంటా రైతులు టెంట్లు వేసుకుని అక్కడే ఉంటున్నారు. ఇక ఉత్తరాదిపై భానుడు ఉగ్రరూపం దాల్చడంతో నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతులు అక్కడే వెదురు గుడిసెలు వేసుకున్నారు. అందులో ఉంటూ ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు.
ఢిల్లీ - సింగు సరిహద్దు వద్ద వెదురుతో చేసిన 110 గుడిసెలను నిర్మించారు రైతులు. అంతేకాదు ఆ గుడిసెల్లో ఫ్రిడ్జ్‌లు, ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లను సైతం ఏర్పాటు చేసుకుని మండే సూర్యుడి నుంచి సురక్షితంగా ఉండేలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ గుడిసెలను ఏర్పాటు చేసుకునేందుకు రైతులు రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇక వీరి గుడిసెలను తీర్చి దిద్దేందుకు వలస కార్మికులు సైతం రంగంలోకి దిగారు. ఇక సింగు సరిహద్దు వద్ద ఉష్ణోగ్రతలు బీభత్సంగా పెరిగిపోతున్నాయి.

గతేడాది నవంబర్ 26వ తేదీన అంటే చలికాలంలో రైతులు తమ నిరసనలతో ఢిల్లీ రోడ్లెక్కారు. అయితే చలికాలంలో రోడ్లపై ఉండటం పెద్దగా ఇబ్బంది ఉండదని అయితే ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఎండలో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉందని రైతులు చెబుతున్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గేది లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక దోమల నుంచి తప్పించుకునేందుకు దోమతెరలను చుట్టూ కట్టారు. అన్ని సదుపాయాలున్న ఒక గుడిసె రూ.1.5 లక్షలు వరకు ధర పలుకుతుండగా... ఒకేసారి 40 నుంచి 45 మంది ఇందులో ఉండేలా ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications