Most Wanted Terrorist హంజా హతం, పుల్వామా దాడి పాపం తగిలింది
భారతదేశాన్ని కుదిపేసిన 2019 పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్ (CRPF) జవాన్ల వీరమరణానికి కారణమైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ అంతమయ్యాడు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని ముజఫరాబాద్‌లో మే 21న గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి . కశ్మీర్ లోయలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నడుపుతూ, ఎంతోమంది యువతను తప్పుదోవ పట్టించిన ఈ కరడుగట్టిన ఉగ్రవాది మరణం.. సరిహద్దు అవతల ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులకు కోలుకోలేని దెబ్బ అని భారత భద్రతాధికారులు భావిస్తున్నారు.
పాకిస్థాన్ ఐఎస్‌ఐ (ISI) మద్దతుతో పనిచేసే అల్-బదర్ (Al-Badr) ఉగ్రవాద సంస్థకు చెందిన బుర్హాన్, 2019 పుల్వామా దారుణ ఉగ్రదాడి సమయంలో అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తించాడు. ఆ సమయంలో అతడు ఒక 'ఓవర్ గ్రౌండ్ వర్కర్' (OGW)గా ఉగ్రవాదులకు స్థానిక సమాచారం అందించడం, ఆయుధాలు, నిధులు సమకూర్చడం వంటి పనులను తెరవెనుక ఉండి నడిపించాడు. ఈ దాడి అనంతరం భారత భద్రతా సంస్థల నుంచి తప్పించుకునేందుకు పాకిస్థాన్ లో ఆశ్రయం పొందాడు. తాజాగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్ ద్వారా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద ప్రచారం, కొత్త నియామకాలు, కరడుగట్టిన భావజాల వ్యాప్తిని పర్యవేక్షిస్తున్న నెట్‌వర్క్ ఒక్కసారిగా కుప్పకూలిందని నిఘా వర్గాలు వెల్లడించాయి.

డిజిటల్ ప్రచారంతో యువతకు వల..
ప్రముఖ జాతీయ వార్తా సంస్థ నివేదికల ప్రకారం.. హంజా బుర్హాన్ కేవలం క్షేత్రస్థాయిలోనే కాకుండా, డిజిటల్ ప్రపంచంలోనూ భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రమైన విషం చిమ్మాడు. అల్-బదర్ సంస్థ తరఫున కశ్మీరీ యువతను ఆకర్షించి ఉగ్రవాదం వైపు నడిపించేందుకు అతడు రకరకాల పోస్టర్‌లు, రెచ్చగొట్టే వీడియోలను రూపొందించాడు. ఈ భారత్ వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియా ద్వారా కశ్మీర్ లోయ అంతటా విస్తృతంగా పంపిణీ చేయడంలో బుర్హాన్ కీలక పాత్ర పోషించాడు.
'కథన యుద్ధం' (Narrative Warfare) ముగిసింది!
ఉగ్రవాదాన్ని కీర్తించడం, అమాయక యువతను సులభంగా లోబరుచుకుని వారి మనసులను మార్చడమే లక్ష్యంగా సాగే "కథన యుద్ధం" (Narrative Warfare) వ్యూహంలో బుర్హాన్ అత్యంత నిపుణుడు. అత్యాధునిక డిజిటల్ టూల్స్ వాడుతూ కశ్మీర్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కథనాలను అల్లేవాడు. అయితే, గత కొంతకాలంగా పాకిస్థాన్ మరియు పీఓకే సరిహద్దుల్లో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను ఏరివేస్తున్న 'గుర్తుతెలియని గన్‌మెన్ల' చేతిలోనే ఇతడు కూడా హతం కావడం సంచలనంగా మారింది. 40 మంది భారత జవాన్ల రక్తంతో తడిసిన పుల్వామా పాపంలో భాగస్వామి అయిన హంజా బుర్హాన్‌కు ఎట్టకేలకు పాక్ గడ్డపైనే అంతిమ తీర్పు లభించినట్లయింది.














Click it and Unblock the Notifications