హర్యానాలో రైతుల ఆందోళన తీవ్రం-ఆగస్టు 28 లాఠీఛార్జ్ పై చర్యలు కోరుతూ భారీ నిరసనలు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ గతేడాది నుంచీ నిరసనలు చేపడుతున్న రైతులు తాజాగా హర్యానాలో తమ ప్రతాపం చూపుతున్నారు. తాజాగా ఆగస్టు 28న ఆందోళనలు చేపట్టిన రైతులపై అక్కడి బీజేపీ సర్కార్ లాఠీచార్జ్ చేయించడంతో రైతులు ఇంకా రగిలిపోతున్నారు. దీంతో ఇవాళ భారీ మార్చ్ చేపట్టారు.
హర్యానాలోని కర్నాల్ లో ఉన్న ధాన్యపు మార్కెట్ నుంచి భారీ మార్చ్ చేపట్టిన రైతులు జిల్లా కేంద్రం వరకూ దీన్ని కొనసాగించబోతున్నారు. ఈ మార్చ్ కు ముందే కర్నాల్లో మహాపంచాయతీ నిర్వహించబోతున్నారు. ఇందులో కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై మిగతా రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించబోతున్నారు. అయితే ఈ ర్యాలీతో పాటు మహాపంచాయతీని అడ్డుకునేందుకు బీజేపీ సర్కార్ అధికారుల్ని పంపింది.

కర్నాల్లో రైతుల మార్చ్ తో పాటు మహాపంచాయతీ విరమించుకోవాలని అధికారులు అన్నదాతల్ని కోరారు. అయితే దీనికి వారు ససేమిరా అన్నారు. ఆగస్టు 28న తమపై లాఠీఛార్జి చేసిన పోలీసు అధికారులపై చర్చలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఈ చర్చలు విఫలమయ్యాయి. అనంతరం వారు ర్యాలీగా బయలుదేరారు. అసలే హర్యానాలో ఎన్నికల వాతావరణం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో రైతుల ఆందోళనలతో బీజేపీ ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తున్నాయి. అలాగని వారిని బుజ్జగించే పరిస్దితులు కూడా లేవు. దీంతో రాబోయే రోజుల్లో ఇది ఖట్టర్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారబోతోంది.

కర్నాల్ జిల్లా కేంద్రాన్ని ముట్టడించేందుకు రైతులు చేపట్టబోతున్న మార్చ్ ను అడ్డుకునేందుకు హర్యానా ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు బలగాల్ని పంపింది. ఎట్టి పరిస్ధితుల్లోనూ రైతుల మార్చ్ అడ్డుకునేలా వ్యూహరచన చేస్తోంది. అయితే రైతులు కూడా మార్చ్ నిర్వహించి తీరాలని అంతే పట్టుదలగా ఉన్నారు. దీంతో కర్నాల్లో ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తుతున్నాయి. రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ తో పాటు మరో నేత యోగీంద్రయాదవ్ కూడా కర్నాల్లో ఉండి రైతుల్ని ముందుకు నడిపిస్తున్నారు. దీంతో వీరిని అడ్డుకోవడం పోలీసులకు కూడా కష్టంగా మారుతోంది. ఏమాత్రం పరిస్ధితులు అదుపుతప్పినా దీని ప్రభావం మిగతా రాష్ట్రాలపై పడే అవకాశం ఉండటంతో హర్యానా సర్కార్ అప్రమత్తంగా ఉంటోంది.












Click it and Unblock the Notifications