ఢిల్లీలో దారుణం: జీతం టైంకు ఇవ్వలేదని ఫ్యాషన్ డిజైనర్ దారుణ హత్య
న్యూఢిల్లీ: 53 ఏళ్ళ ఫ్యాషన్ డిజైనర్‌ను, 50 ఏళ్ల ఆమె హెల్పర్‌ను ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో బుధవారం రాత్రి హత్య చేశారు. ఫ్యాషన్ డిజైనర్ పేరు మాలా లఖానీ. ఆమె గ్రీన్ పార్క్‌లో ఓ బొటిక్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఓ వ్యక్తి కూడా పని చేస్తున్నాడు. ఈ హత్యకు సంబంధించి అతనితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ బొటిక్‌లో పని చేసే నిందితుడి పేరు రాహుల్ అన్వర్. అతను ఈ బొటిక్‌లో దర్జీగా పని చేస్తున్నాడు. హత్యకు సంబంధించి అతను తన బంధవులు రహ్మత్, వసీంలతో కలిసి గురువారం వేకువజామున మూడు గంటలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
గురువారం వేకువజామున మాలా లఖానీ ఇంటి తలుపు తెరిచి ఉంది. గేటు దగ్గర ఉండాల్సిన గార్డు కనిపించలేదు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి చూడగా లఖానీ, సెక్యూరిటీ గార్డు బహదూర్ సింగ్ రక్తపు మడుగులో పడి ఉన్నారు.

దుండగులు వారిని కత్తితో పొడిచి చంపేసినట్లు గుర్తించారు. ఈ హత్య బుధవారం రాత్రి పది గంటలకు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. లఖానీ శరీరంపై దాదాపు పదిసార్లు పొడిచిన గాయాలు ఉన్నాయి. ఆమె మృతదేహం బెడ్రూంలో పడి ఉంది. గార్డు మృతదేహం లివింగ్ రూంలో ఉంది.
మాలా లఖానీ వద్ద పని చేసే వ్యక్తితో పాటు మరో ఇద్దరు లొంగిపోవడంతో పోలీసులు వారిని విచారించారు. తనకు జీతం సమయానికి ఇవ్వడం లేదని వారు ఆమెతో గొడవపడి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. జీతం ఇవ్వకపోవడంతో నిందితులు దోపిడీ చేయడంతోపాటు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications