ధీశాలి: అసభ్యంగా ప్రవర్తించాడని చితక్కొట్టి.. ఈడ్చుకెళ్లి పీఎస్‌లో అప్పగించింది
ముంబై: తన పట్ల అసభ్యంగా ప్రవర్థించిన ఓ తాగుబోతును చితక్కొట్టింది. అంతేగాక, అతడి జుట్టు పట్టుకుని లాక్కెళ్లి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన బుధవారం పట్టపగలు కండివిలి రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. తనను వేధిస్తున్న సమయంలో తన చుట్టూ 50 మంది ఉన్నా తనకు వారి నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఆ యువతి వాపోయింది.
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బోర్విలికి చెందిన మంధరే విలే పార్లేలోని సతాయే కాలేజీలో మాస్ మీడియా మూడవ సంవత్సరం చదువుతోంది. కాలేజీ నుంచి తిరిగి వస్తూ లోకల్ ట్రైన్ కోసం స్టేషన్లో ఎదురు చూస్తుండగా... ఓ తాగుబోతు ఆమె మీద చేయి వేశాడు. భయంతో పక్కకు జరిగింది. దీంతో మరింత ముందుకు వచ్చాడా దుండగుడు. అంతటితో ఆగకుండా ఆమె శరీర భాగాలను తాకేందుకు ప్రయత్నించాడు.

షాక్ నుంచి తేరుకున్న ఆమె వెంటనే తన దగ్గరున్న కాలేజీ బ్యాగ్‌తో అతడ్ని నాలుగు ఉతుకులు ఉతికింది. దీంతో అతడు ఎదురు దాడికి దిగాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి.. అతడి జుట్టు పట్టుకుని రైల్వే పోలీస్ స్టేషన్ దాకా ఈడ్చుకెళ్లి పోలీసులుకు అప్పగించింది. ఇంత జరుగుతున్నా చుట్టపక్కల ఉన్న జనం చోద్యం చూస్తూ నిలబడ్డారే తప్ప, ఆమెకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
అయినా ఆమె ఒంటరిగానే పోరాడింది. ‘వాడు తాగి మత్తులో ఊగుతున్నాడు... పైగా కనీసం తాకడానికి భయపడేంత మురికి కంపు కొడుతున్నాడు. నామీద దాడి చేస్తాడేమోనని భయం వేసింది కాసేపు. అయినా ధైర్యంగా ఎదుర్కొన్నాను' అంటూ చెప్పుకొచ్చింది మంధరే. ప్రతి అమ్మాయి ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండకూడదని, ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పుకొచ్చింది. అంతేగాక, కచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పిందీ కాలేజీ ధైర్యశాలి.












Click it and Unblock the Notifications