కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అరుణ్ జైట్లీ..
న్యూఢిల్లీ: విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. త్వరలోనే ఆయనకు సర్జరీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం జైట్లీ(65)కి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్లు.. ఆయన్ను బయటకు వెళ్లవద్దని సూచించారు. బయటకు వెళ్తే ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నందున ఆ సూచన చేశారు.

ఈ నేపథ్యంలోనే గత సోమవారం నుంచి జైట్లీ తన కార్యాలయానికి కూడా రావడం లేదు. రాజ్యసభకు తిరిగి ఎన్నికైనప్పటికీ.. ప్రమాణ స్వీకారానికి కూడా రాలేకపోయారు. కాగా, కొత్తగా ఎన్నికైన 58మంది రాజ్యసభ సభ్యుల్లో 53మంది గత రెండు రోజుల్లో ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేయని మిగతా ఐదుగురిలో జైట్లీ కూడా ఒకరు.
కాగా, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే జైట్లీ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైట్లీకి ఆయన ఇంటి వద్దే చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కి సంబంధించి వైద్యుల నుంచి ఇంకా కచ్చితమైన సూచనలేవి రాలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications