‘కాంతార’ ఒక అద్భుతం: సినిమా చూసిన నిర్మలా సీతారామన్, శ్రీశ్రీ రవిశంకర్
బెంగళూరు: కన్నడ సినిమాగా వచ్చిన 'కాంతార'.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ సత్తా చాటుతోంది. ఏకంగా 300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి సంచలనం రేపుతోంది. విడుదలై దాదాపు నెలరోజులు గడుస్తున్నా.. 'కాంతార' చిత్రానికి ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు పలువురు ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
బెంగళూరులో కాంతార సినిమా చూసిన నిర్మలా సీతారామన్
తాజాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులో కాంతార చిత్రాన్ని వీక్షించి ప్రశంసలతో ముంచెత్తారు. తన వాలంటీర్లు, శ్రేయోభిలాషులతో కలిసి బుధవారం బెంగళూరులోని ఓ థియేటర్‌లో కాంతార చిత్రాన్ని తిలకించారు. అనంతరం ఆ సినిమా అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
కాంతార అద్భుతమంటూ నిర్మలా సీతారామన్ ప్రశంసలు
తులువనాడు, కరావళి ప్రాంతంలోని సంప్రదాయాలకు కాంతార ప్రతీకగా నిలిచిందని నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా కొనియడారు. అక్కడి సంప్రదాయాలను అందంగా చిత్రీకరించారన్నారు. హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టిపై నిర్మలా సీతారమన్ పొగడ్తల వర్షం కురిపించారు.
థ్యాంక్యూ మేడమ్ అంటూ నిర్మలకు రిషబ్ శెట్టి రిప్లై
థియేటర్ లో దిగిన పొటోను కేంద్రమంత్రి ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నారు. నిర్మలా సీతారామన్.. రిషబ్ శెట్టికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపినట్లు సమాచారం. ఇందుకు థ్యాంక్యూ మేడమ్ అంటూ రిషబ్ శెట్టి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కాంతార చిత్రం భారీ వసూళ్లతో రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటి వరకు రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. తెలుగులో ఇప్పటికే రూ. 50 కోట్లు వసూలు చేసింది.
కర్ణాటకకు గర్వకారణమంటూ శ్రీశ్రీ.. రిషబ్ శెట్టి ప్రామిస్
మరోవైపు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కూడా బెంగళూరులోని తన ఆశ్రమంలో తన భక్తులు, అనుచరులతో కలిసి కాంతార చిత్రాన్ని వీక్షించారు. కాంతార చిత్రం అద్భుతంగా ఉందన్నారు. కర్ణాటకకు గర్వకారణంగా ఈ చిత్రం నిలిచిందని కొనియాడారు. మలేనాడు గొప్పతనాన్ని ఎంతో అందంగా చూపించారని ప్రశంసించారు. ఈ క్రమంలో స్పందించిన రిషబ్ శెట్టి.. శ్రీశ్రీకి ధన్యవాదాలు చెప్పారు. ఆశ్రమంలో తమ చిత్రం ప్రదర్శించడం గొప్ప విషయమన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగుతామన్నారు.












Click it and Unblock the Notifications