ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్ని ప్రమాదం: నావికాదళ అధికారి గల్లంతు
భారత నావికాదళంలోని ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర(INS Brahmaputra) యుద్ధనౌక అగ్నిప్రమాదానికి గురైంది. మెయింటనెన్స్‌లో భాగంగా ముంబై నావల్ డాక్‌యార్డ్‌లో రీఫిట్టింగ్ సర్వీస్‌లు చేస్తుండగా యుద్ధనౌకలో మంటలు చెలరేగినట్లు నావికాదళ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఓ జూనియర్ నావికాదళ అధికారి గల్లంతు కాగా, అతని కోసం సహాయక బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు.
మిగిలిన సిబ్బంది క్షేమంగానే ఉన్నట్లు నావికాదళం పేర్కొంది. మంటలు చెలరేగగానే అప్రమత్తమైన డాక్‌యార్డ్ అగ్నిమాపక సిబ్బంది, గంటల తరబడి శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ క్రమంలో యుద్ధనౌక ఒకవైపునకు పూర్తిగా ఒరిగింది. ప్రమాద తీవ్రతను అంచనా వేసేందుకు శానిటైజేషన్ తనిఖీలతో సహా తదుపరి చర్యలు చేపట్టామనీ, ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించామని ప్రకటించింది.

స్వదేశీ నిర్మిత క్లాస్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్‌లో ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర మొదటిది. 2000 సంవత్సరంలో నౌకాదళంలోకి చేరిన ఈ యుద్ధనౌకలో స్వల్ప, మధ్యశ్రేణి విమాన విధ్వంసక గన్లు, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, టార్పెడో లాంచర్‌లు ఉన్నాయి.
ఈ నౌకలో 40 మంది అధికారులు, 330 మంది నావికులు, సిబ్బంది ఉన్నారు. జూనియర్ నావికుడు తప్ప మిగితా వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. మిస్సింగ్ నావికుడి కోసం గాలింపు జరుగుతోందని, ప్రమాదంపైనా విచారణ జరుగుతోందని నౌకాదళం వెల్లడించింది. మరోవైపు, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఘటనకు సంబంధించి ఆరా తీశారు. నౌకదళానికి సంబంధించిన అధికారులు ఈ ఘటనపై వివరాలను రక్షణ మంత్రికి వివరించారు.












Click it and Unblock the Notifications