భారత్-చైనా సరిహద్దుల్లో కాల్పులు: జవాన్లపై వార్నింగ్ షాట్ ఫైరింగ్: చైనా సైనికుల బరితెగింపు
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు యుద్ధానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి. లఢక్ తూర్పు సెక్టార్ పరిధిలో రెండు దేశాల మధ్య సైనికుల మధ్య తలెత్తిన వివాదాలు, ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉగ్రరూపాన్ని దాాల్చాయి. వాస్తవాధీనరేఖ వెంబడి ఉన్న పాంగ్యాంగ్ త్సొ సరస్సు సమీపంలో రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు దేశాల సైనికుల మధ్య కిందటి నెల 29, 30 తేదీల్లో ఘర్షణలు చోటు చేసుకున్న ప్రదేశంలో ఈ కాల్పుల ఘటన సంభవించింది.

ఘర్షణ చోటు చేసుకున్న ప్రాంతంలోనే..
భారత జవాన్లు సరిహద్దులను దాటుకుని తమదేశ భూభాగంపైకి ప్రవేశించడానికి ప్రయత్నించారని, దీనితో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు కాల్పులు జరిపినట్లు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఇదే విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ వెల్లడించింది. పాంగ్యంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతంలోని షెన్‌పావో పర్వతంపై వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు చోటు చేసుకున్నట్లు ఆర్మీ వర్గాలను ఉటంకించింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అదుపులో ఉన్నట్లు పేర్కొంది.

షెన్‌పావో పర్వతంపై భారత జవాన్లపై కాల్పులు..
పాంగ్యాంగ్ త్సొ సరస్సు సమీపంలోని షెన్‌పావో పర్వతంపై భారత సైనికులు వాస్తవాధీన రేఖను దాటుకుని తమ దేశ భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించారని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధిని ఉటంకిస్తూ చైనా అధికారి మీడియా గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. వారిని నియంత్రించడానికి చైనా బలగాలు వార్నింగ్ షాట్ ఫైరింగ్ నిర్వహించాయని, ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నట్లు పీఎల్ఏ అధికార ప్రతినిధి, పశ్చిమ సెక్టార్ థియేటర్ కమాండ్ సీనియర్ కల్నల్ ఝాంగ్ షుయిల్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

భారత జవాన్లపై చైనా ఆర్మీ ఆరోపణలు..
భారత సైనికులు ఉద్దేశపూరకంగా తమ దేశ భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. వారిని నిలురించే ప్రయత్నంలో కాల్పులు జరపాల్సి వచ్చిందని అన్నారు. భారత ప్రభుత్వం, ఆర్మీ అధికారులు తక్షణమే తమ జవాన్లను నియంత్రించుకోవాలని ఝాంగ్ డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు రెండు దేశాలకూ మంచివి కావని, పరిస్థితులు చేయి దాటేలా చేస్తాయని అన్నారు. పొరుగు దేశ భూభాగంపైకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించడం ఆ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించినట్టవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
Recommended Video

వాస్తవాధీన రేఖ వద్ద మరింత ఉద్రిక్తత..
ఈ కాల్పుల ఘటనతో వాస్తవాధీనరేఖ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రం అయ్యాయి. ఈ ఘటనపై భారత ఆర్మీ అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కాల్పులు ఉదంతాన్ని ధృవీకరించలేదు. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య విడతలవారీగా చర్చలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత జవాన్లపై చొరబాటు ప్రయత్నం చేశారంటూ చైనా సైనికులు.. వార్నింగ్ షాట్ ఫైరింగ్‌కు పాల్పడటం ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోననే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications