బస్సును పేల్చేసిన మావోయిస్టులు: ఐదుగురు పోలీసులు మృతి, 15 మందికి గాయాలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. రాయ్‌పూర్ జిల్లా రిజర్వు గార్డ్స్(డీఆర్‌జీ) సిబ్బంది వెళ్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని బాంబు దాడికి పాల్పడ్డారు. నారాయణపూర్ జిల్లాలో 27 మంది సిబ్బందితో వెళుతున్న బస్సును లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చారు.
ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. వారిని నారాయణపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(డీఆర్‌జీ) పార్టీ తిరిగి వస్తుండగా మంగళవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో ఓ బ్రిడ్జి వద్ద మావోయిస్టులు బాంబు పెట్టి బస్సును పేల్చేసినట్లు ఛత్తీస్‌గఢ్ యాంటీ నక్సల్స్
ఆపరేషన్ డీజీ అశోక్ జునేజా తెలిపారు.
కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్తీ మాట్లాడుతూ.. కూంబింగ్ నిర్వహించిన అనంతరం తిరిగివస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు.