Delhi Rains: 40 ఏళ్లలో తొలిసారిగా ఆ రికార్డు నమోదు చేసిన ఢిల్లీ నగరం..!
ఢిల్లీ: ఉత్తర భారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఢిల్లీ నగరం ఒక రికార్డు నమోదు చేసింది. గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా తొలిసారిగా అత్యంత తడి ప్రదేశంగా ఢిల్లీ గుర్తింపు సాధించింది. ఇక ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలకు 22 మంది మృతి చెందినట్లు సమాచారం.
ఆదివారం రోజున ఢిల్లీ నగరంలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఢిల్లీ నగరమంతా అత్యంత తడి ప్రదేశంగా కనిపించింది. అంతకుముందు 1982 జూలైలో ఇలాంటి పరిస్థితి కనిపించిందని వాతావరణ నిపుణులు గుర్తు చేశారు.

ఇదిలా ఉంటే ఆదివారం రోజున ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు ముప్పు పొంచి ఉందన్న సంకేతాలను పంపింది. రానున్న 24 గంటల్లో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు. రహదారులు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో స్కూళ్లు కాలేజీలకు కూడా సెలవులను ప్రకటించినట్లు సీఎం సుఖ్విందర్ సింగ్ చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్‌లో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. కుల్లు జిల్లాలో బియాన్ నది పొంగి ప్రవహిస్తోంది. దీంతో అక్కడ ఓ హోటల్ నీటమునిగింది. అందులో ఉన్న 27 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడింది. ఇదిలా ఉంటే ఉత్తర భారత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, చండీగడ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు రానున్న ఐదు రోజుల్లో ర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications