• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఫ్లడ్ జిహాద్': అస్సాంలో వరదలకు ముస్లింలే కారణమా? ఏది నిజం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అస్సాం

ఇటీవల అస్సాంలో వరదలు ముంచెత్తాయన్న సంగతి తెలిసిందే. అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఎంతోమంది జీవితాలను కోల్పోయారు. ఈ విపత్తుకు స్థానిక ముస్లింలే కారణమనే వాదనలు ఆన్‌లైన్‌లో ప్రచారమవుతున్నాయి.

ఈ ఆరోపణల్లో నిజమెంత? ఇలాంటి ఆరోపణలతో వల్ల ఇబ్బందుల పాలైన ఒక వ్యక్తితో బీబీసీ మాట్లాడింది.

జూలై 3 తెల్లవారుజామున పోలీసులు నజీర్ హుస్సేన్ లస్కర్ తలుపులు తట్టారు. వారిని చూసి నజీర్ అయోమయంలో పడ్దారు. చాలా ఏళ్లుగా నజీర్ అస్సాంలో భవన నిర్మాణాల్లో కూలీగా పనిచేస్తున్నారు. వరద రక్షణ వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వానికి సహాయం చేశారు.

ఆరోజు ఉదయం పోలీసులు నజీర్‌ను అరెస్ట్ చేశారు. "ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారన్న" ఆరోపణలతో ఆయన్ను జైలులో పెట్టారు. ప్రత్యేకించి, వరదల నుంచి కాపాడే కట్టను పడగొట్టారని ఆరోపించారు.

"16 ఏళ్ల పాటు నేను కరకట్టల నిర్మాణంలో ప్రభుత్వంతో కలిసి పనిచేశాను. నేనెందుకు వాటిని పడగొడతాను?" అని నజీర్ అంటున్నారు.

నజీర్‌ను దాదాపు 20 రోజులు జైలులో పెట్టారు. తరువాత ఆయన బెయిల్‌లో బయటికొచ్చారు. ఆయన కట్టలను ధ్వంసం చేసినట్టు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. కానీ, అప్పటి నుంచి సోషల్ మీడియాలో నజీర్ గురించి తప్పుడు ప్రచారాలు పోటెత్తుతున్నాయి.

'నా మీద దాడి చేస్తారని భయపడ్డాను'

ఈ ఏడాది మే, జూన్‌లలో రెండుసార్లు వరదలు అస్సాంను ముంచెత్తాయి. కనీసం 192 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలు అస్సాంకు కొత్త కాదు. కానీ, ఈసారి వర్షాలు తొందరగా కురిశాయి. భారీగా కురిశాయి.

కొందరు సోషల్ మీడియా యూజర్లకు ఓ సాకు దొరికింది. ఎలాంటి ఆధారాలు చూపకుండా, మనుషులే ఈ వరదలను సృష్టించారని, కొందరు ముస్లింలు ఉద్దేశపూర్వకంగానే వరదల రక్షణ వ్యవస్థను కూల్చివేసి హిందువులు ఎక్కువగా ఉన్న సిల్చార్ పట్టణాన్ని ముంచెత్తే పథకం పన్నారని ఆరోపణలు లేవనెత్తారు.

దీనికి 'ఫ్లద్ జిహాద్' అని పేరు కూడా పెట్టారు. నజీర్ సహా ముగ్గురు ముస్లిం వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడంతో, సోషల్ మీడియాలో 'ఫ్లడ్ జిహాద్' పోస్టులు వెల్లువెత్తాయి.

ఈ పోస్టులను వెనకా ముందూ చూడకుండా వేలాది మంది షేర్ చేశారు. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా చాలామంది సోషల్ మీడియా ఇంఫ్లుయెన్సర్లు కూడా షేర్ చేశారు. దాంతో, స్థానిక మీడియాలో సైతం 'ఫ్లడ్ జిహాద్' వార్తలు రావడం మొదలైంది.

అప్పటికే జైలులో ఉన్న నజీర్, స్థానిక టీవీ వార్తల్లో తన పేరు కనిపించగానే ఉలిక్కిపడ్డారు. "ఫ్లడ్ జిహాద్" అంటూ తన పేరును ప్రస్తావించడంతో ఆయన ఆందోళన చెందారు.

"చాలా భయమేసింది. ఆ రాత్రి నిద్రపోలేదు. జైలులో మిగతా ఖైదీలు కూడా దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నా మీద దాడి చేస్తారేమోనని భయపడ్డా" అని నజీర్ చెప్పారు.

'ఫ్లడ్ జిహాద్' ఆరోపణల వెనుక నిజాలు

1950ల నుంచి అస్సాంలో వరదలను అడ్డుకోవడంలో కరకట్టల నిర్మాణం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆ రాష్ట్రంలో 4,000 కిమీకు పైగా కరకట్టలు ఉన్నాయి. అయితే, వీటిలో చాలా కట్టలు పెళుసుబారిపోయాయని, దెబ్బతినే అవకాశాలు ఎక్కువ అని పలువురు భావిస్తున్నారు.

మే 23న బరాక్ నదిపై ఒక కట్ట దెబ్బతింది. ఈ నది ఈశాన్య భారతదేశం, తూర్పు బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తుంది.

ముస్లిం జనాభా అధికంగా ఉండే బెతుకండి ప్రాంతంలో ఈ కోత ఏర్పడింది. హిందువులు మెజారిటీగా ఉన్న సిల్చార్‌లో భారీ వరదలకు దోహదపడ్డ అనేక కారణాల్లో ఇదీ ఒకటి.

"బరాక్ నదిపై కట్ట తెగడం ఒక కారణం. అయితే, అదొక్కటే కారణం కాదు. అక్కడి నుంచి మాత్రమే పట్టణంలోకి నీరు ప్రవేశించలేదు" అని సిల్చార్‌లోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రమణదీప్ కౌర్ చెప్పారు.

అయితే, నజీర్ సహా మరో ముగ్గురు ముస్లింలను అరెస్ట్ చేయడానికి ఈ ఘటనే కారణమని బీబీసీ భావిస్తోంది. తరువాత అయిదవ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అయితే, ఆ కోతకు ఈ అయిదుగురికి సంబంధం ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

"కట్టల నిర్వహణలో వైఫల్యం, సరిగా రిపేర్లు చేయకపోవడం వలన అవి తెగిపడతాయి. అయితే, కొన్ని మానవ తప్పిదాలు కూడా కావచ్చు. కొన్నిసార్లు కావాలనే కరకట్టలను పడగొడతారు. తమ ప్రాంతం మునిగిపోకుండా నీరు బయటకి ప్రవహించేందుకు ఇలా చేస్తుంటారు" అని ముంబైలోని జమ్షెడ్జీ టాటా స్కూల్ ఆఫ్ డిజాస్టర్ స్టడీస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ నిర్మల్య చౌదరి అన్నారు.

సిల్చార్ పోలీసులు కూడా ఈ కారణాలను అంగీకరించారు.

"నిజానికి 'ఫల్డ్ జిహాద్' అని ఏమీ లేదు. గతంలో ప్రభుత్వమే కట్టల్లో కోత పెట్టి నీటిని బయటకు పంపించేది. ఈ ఏడాది అది జరగలేదు. దాన్ని కొంతమంది చేతుల్లోకి తీసుకున్నారు. ఇలాంటి ఆరోపణలు (ఫ్లడ్ జిహాద్ లాంటివి) చేయడం సులువుగా సమస్యను తప్పించుకోవడానికే. ఇది నిర్వహణ లోపం. దీనికి లోతైన పరిష్కారం ఆలోచించాలి" అని ప్రొఫెసర్ నిర్మల్య చౌదరి అన్నారు.

అస్సాం

'నేను ముస్లింను కాబట్టే నాపై ఇలాంటి ఆరోపణలు చేశారు'

గూగుల్ ట్రెండ్స్ చూస్తే 'ఫ్లడ్ జిహాద్' టాప్‌లో ఉంది. సోషల్ మీడియా ఉన్మాదంతో జూలైలో ఈ పదం సెర్చ్ అయిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది.

అయితే, భారతదేశంలో ముస్లిం వ్యతిరేక సిద్ధాంతాలు, కుట్రలు కొత్తేం కాదు.

కరోనా మహమ్మారి వ్యాప్తికి ముస్లింలే కారణమనే తప్పుడు ప్రచారాలు జరిగాయి. కొన్ని మీడియా సంస్థలు దీన్ని 'కరోనా జిహాద్' అని పేర్కొన్నాయి కూడా.

2014లో ప్రధాని నరేంద్ర మోదీ హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లింలను లక్ష్యంగా చేసుకుని హింస, ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు పెరిగాయని విమర్శకులు అంటున్నారు. అయితే, బీజేపీ దీన్ని ఖండిస్తోంది.

ఇదిలా ఉండగా, అస్సాంలో నజీర్ జైలు నుంచి విడుదలైన తరువాత కూడా భయంలోనే బతుకుతున్నారు.

"నేను, నా కుటుంబం ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నాం. మా పిల్లలు స్కూలుకు వెళ్లడం మానేశారు. ఎప్పుడైనా బయటికెళ్లాల్సి వస్తే నా ముఖం కనిపించకుండా హెల్మెట్ పెట్టుకుని వెళుతున్నాను. జనాలు మీదపడి కొడతారేమోనని భయం" అంటూ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు.

"నేను ముస్లింను కాబట్టే 'ఫ్లడ్ జిహాద్' పేరుతో నాపై నిందలు వేశారు. ఇది తప్పు. దీన్ని ప్రచారం చేస్తున్నవారు చాలా తప్పు చేస్తున్నారు" అని ఆయన అన్నారు.

అదనపు రిపోర్టింగ్: దిలీప్ కుమార్ శర్మ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
'Flood Jihad': Are Muslims responsible for floods in Assam? Which is true
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X