వందే భారత్ 2.0: పట్టాలెక్కిన రెండు రైళ్లు: అయిదున్నర గంటల్లో షిర్డీకి..!!
రేపు ఒకేసారి రెండు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కబోతోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ముంబై నుంచి షిర్డీ, షోలాపూర్ మధ్య ఈ రెండు రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల హవా మొదలైంది. ఒకేసారి రెండు రైళ్లు పట్టాలెక్కాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే పచ్చజెండా ఊపి వాటిని ప్రారంభించారు. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఎనిమిది రైళ్లు రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సిరీస్ లో ఎనిమిదో రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తిరుగాడుతోంది. దీని తరువాత 9, 10వ రైళ్లు ఇవ్వాళ అందుబాటులోకి వచ్చాయి.

వేగం.. సౌకర్యం..
ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ల రేట్లు రెట్టింపు అయినప్పటికీ ప్రయాణికులు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఫలితంగా వారి తాకిడి ఏ మాత్రం తగ్గట్లేదు. సమయం, వేగానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. వివిధ నగరాల మధ్య వందలాది కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే విషయంలో సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో వందే భారత్ రైళ్లపై ఆధారపడుతున్నారు. ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే వందే మెట్రో, వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని రానుంది.

షిర్డీతో పాటు..
తాజాగా ప్రధాని మోదీ చేతుల మీదుగా పట్టాలెక్కిన ఈ రెండు రైళ్లు మహారాష్ట్రలోనే తిరుగాడేవే. ముంబై- సాయినగర్ షిర్డీ, ముంబై-షోలాపూర్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తోన్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఇవి రూపుదిద్దుకున్నాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ లో ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి వాటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.

ఫైనాన్స్ హబ్స్ మధ్య
ఈ రైళ్లను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. మొదటి సారి రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభించామని, ఇది చారిత్రాత్మక సందర్భమని వ్యాఖ్యానించారు. ముంబై, పూణే వంటి ఫైనాన్షియల్ హబ్స్ ను ఈ రైళ్లు అనుసంధానిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సాయినాథుడి భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు.

షిర్డీ రైలు టైమింగ్ ఇదీ..
ముంబై-షిర్డీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 22223 ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి తెల్లవారు జామున 6:20 నిమిషాలకు బయలుదేరుతుంది. ఉదయం 11:40 నిమిషాలకు షిర్డీకి చేరుకుంటుంది. డౌన్ లో నంబర్ 22224 వందే భారత్ ఎక్స్ ప్రెస్ షిర్డీ నుంచి సాయంత్రం 5:25 నిమిషాలకు బయలుదేరి రాత్రి 10:50 నిమిషాలకు ముంబై సీఎస్టీకి చేరుకుంటుంది. దాదర్, థానే, నాసిక్ రోడ్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజులూ ఈ రైలు అందుబాటులో ఉంటుంది.

షోలాపూర్ రైలు టైమింగ్ ఇదీ..
ముంబై-షొలాపూర్ మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 22225 ముంబై సీఎస్టీ నుంచి సాయంత్రం 4:05 నిమిషాలకు బయలుదేరి రాత్రి 10:40 నిమిషాలకు షోలాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 22226 నంబర్ ఎక్స్ ప్రెస్ షోలాపూర్ లో తెల్లవారు జామున 6:05 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 12:35 నిమిషాలకు ముంబై సీఎస్టీకి చేరుకుంటుంది. దాదర్, కళ్యాణ్, పూణే, కుర్దువాడి స్టేషన్లలో ఆగుతుంది. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజులూ ఈ రైలు అందుబాటులో ఉంటుంది.












Click it and Unblock the Notifications