బీజేపీకి భారీ దెబ్బ కొట్టిన హెగ్డే, కేంద్ర మంత్రి మీద పోరాటం, ఎంపీ టిక్కెట్ హామీతో రివర్స్ గేర్!
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉడిపి-చిక్కమగళూరు నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జయప్రకాష్ హెగ్డే కాంగ్రెస్‌లో చేరారు. ఆ నియోజకవర్గ ప్రస్తుత ఎంపీ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే బీజేపీ అభ్యర్థి అని ప్రచారం జరుగుతున్న సమయంలో జయప్రకాష్ హెగ్డే కాంగ్రెస్ లో చేరడం ఆసక్తికరంగా మారింది.
కేపీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ జయప్రకాష్ హెగ్డే, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక మంత్రులు డాక్టర్ జీ. పరమేశ్వర్, కేజే జార్జ్, మధు బంగారప్ప, లక్ష్మీ హెబ్బాళ్కర్, శృంగేరి ఎమ్మెల్యే రాజేగౌడ, శాసనమండలి సభ్యుడు యుబీ. వెంకటేష్‌తోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మొదట కాంగ్రెస్ ను వీడి తరువాత బీజేపీలో చేరిన జయప్రకాశ్ హెగ్డే మంగళవారం మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఉడిపి-చిక్కమగళూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనే పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు జయప్రకాష్ ను లోక్ సభ అభ్యర్థిగా చేయడంపై కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ టికెట్ సుధీర్ కుమార్ మురోళికి ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్తలు పట్టుబడుతున్నారు.
2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఉడిపి-చిక్కమగలూరు నియోజకవర్గం ఏర్పడింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జయప్రకాష్ హెగ్డే పోటీ చేశారు. బీజేపీకి చెందిన డీవీ సదానంద గౌడ చేతిలో ఆయన ఓడిపోయారు. సదానంద గౌడ తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. 2012లో నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాష్ హెగ్డే విజయం సాధించారు.
కానీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాష్ హెగ్డే ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శోభా కరంద్లాజే విజయం సాధించారు. జయప్రకాష్ హెగ్డే 2017లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. తరువాత వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్‌గా జయప్రకాశ్ హెగ్డే నియమితులయ్యారు. ఫిబ్రవరి నెలాఖరున కర్ణాటక ప్రభుత్వానికి కుల గణన నివేదికను జయప్రకాష్ హెగ్డే సమర్పించారు.
జయప్రకాష్ హెగ్డే తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారనే వార్తలు గత కొంతకాలంగా ప్రచారంలో ఉంది. అయితే ఈరోజు కేపీసీసీ కార్యాలయంలో జయప్రకాష్ హెగ్డే కాంగ్రెస్ పార్టీలో చేరారు. జయప్రకాష్ హెగ్డేకు జెంటిల్‌మన్ పొలిటీషియన్‌గా పేరుంది. ఉడిపి-చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గానికి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో జయప్రకాష్ హెగ్డే పేరు ఉంది. అయితే కాంగ్రెస్‌లో గో బ్యాక్ హెగ్డే అనే ప్రచారం అప్పుడే మొదలు కావడంతో ఆయన వర్గీయుల్లో ఆందోళన మొదలైయ్యింది.












Click it and Unblock the Notifications