కరుణకు నెపోలియన్ షాక్, బీజేపీలోకి: అళగిరికి మద్దతుగానా..
చెన్నై: ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్ డీఎంకే అధ్యక్షులు కరుణానిధికి షాకిచ్చారు. ఆయన ఆదివారం నాడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి 2016 ఎన్నికలకు వెళతామని చెప్పారు. బీజేపీ నేతృత్వంలో 2016 ఎన్నికలకు తమ అలయెన్స్ ముందుకు వెళ్తుందని చెప్పారు. తాము నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ ముఖ్యమంత్రిని ప్రకటిస్తామని చెప్పారు.
నెపోలియన్ శనివారం నాడు డీఎంకే పార్టీని వీడారు. ఇతను మాజీ మంత్రి కెఎన్ నెహ్రూకు దగ్గరి బంధువు. నెపోలియన్ కమలం పార్టీలో చేరడం ఆ పార్టీకి పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. 2016 ఎన్నికల నాటికి తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీకి ధీటుగా ఎదగాలని బీజేపీ చూస్తోంది.

ఈ సమయంలో రజనీకాంత్, విజయ్ వంటి హీరోలను తమ వైపుకు తిప్పుకోవాలని గతంలో చూసింది. అవి ఫలించలేదు. ఇప్పుడు నెపోలియన్ బీజేపీలో చేరారు. ఇది ఆ పార్టీకి చాలా ప్లస్ అని అంటున్నారు.
కాగా, నెపోలియన్ శనివారం నాడు డీఎంకే అధ్యక్షులు కరుణానిధికి లేఖ రాశారు. అందులో.. తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తాను పార్టీకి 16 ఏళ్ల వయస్సు నుండి సేవ చేస్తున్నానని, 35 ఏళ్లుగా పార్టీకి సేవ చేశానని చెప్పారు.
అందుకు కరుణానిధికి, అంబజగన్‌కు, ఎంకే స్టాలిన్‍కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఏళ్లుగా మద్దతుగా నిలిచారన్నారు. కాగా, నెపోలియన్.. కరుణానిధి పెద్ద తనయుడు ఎంకే అళగిరికి మద్దతుగా ఆ పార్టీ నుండి సైడ్ అయినట్లుగా తెలుస్తోంది. దీని పైన డీఎంకే స్పందించలేదు.












Click it and Unblock the Notifications