అతను నన్ను లాక్కెళ్లాడు, లైట్లు వేయడంతో..: బెంగళూరు బాధితురాలు
తన పైన లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను తాను గుర్తించగలనని బెంగళూరులోని కమ్మనహళ్లి సంఘటన బాధితురాలు పోలీసులకు తెలిపారు.
బెంగళూరు: తన పైన లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను తాను గుర్తించగలనని బెంగళూరులోని కమ్మనహళ్లి సంఘటన బాధితురాలు పోలీసులకు తెలిపారు. ఆమె నివాసానికి వెళ్లిన పోలీసు అధికారులు శుక్రవారం పలు విషయాలు సేకరించారు.
అనంతరం బాణసవాడి పోలీస్ స్టేషన్లో నిందితుల్ని గుర్తించే పెరేడ్ నిర్వహించారు. దౌర్జన్యానికి పాల్పడిన ఇద్దరిని ఆమె గుర్తించారు. మిగిలిన వ్యక్తులు తనకు తెలియదని, వారిని ఎన్నడూ చూడలేదని, పరిచయం లేదన్నారు.
వారి చేత ఎప్పుడు భోజనం తెప్పించుకోలేదన్నారు. వెంబడిస్తున్నారనే విషయమూ గుర్తించలేదన్నారు. కొత్త ఏడాది సందర్భంగా స్నేహితులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొని, తెల్లవారు జామున రెండుగంటల తర్వాత ఆటోలో ఇంటికి వచ్చినట్లు తెలిపారు.

రోడ్డు పైన దిగి ఇంటికి నడిచి వస్తుండగా బైక్ పైన వచ్చిన ఇద్దరు యువకులు చుట్టుముట్టారని చెప్పారు. వారి నుంచి రక్షణ కోసం ప్రతిఘటిస్తూ కేకలు వేసినట్లు తెలిపారు. ఓ యువకుడు దురుసుగా వ్యవహరించి లాక్కెళ్లి వాహనంపై కూర్చోబెట్టే ప్రయత్నం చేశాడన్నారు.
తీవ్ర ప్రతిఘటనతో కేకలు వేశానని, అదే సమయానికి అక్కడి ఓ ఇంటి దీపాలు వెలగడంతో దుండగులు తనను వదిలేసి పరారయ్యారని ఆమె తెలిపారు. కాగా, నలుగురు నిందితుల్ని కోర్టు ముందు హాజరు పరిచి ఈ నెల పదో తేదీ వరకు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులు అయ్యప్ప, లెనిన్ ఫ్యాట్రిక్, సోమశేఖర్, సుధీష్‌లను బానసవాడి పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications