ఆరుగురి దారుణ హత్య: ప్రేమ వ్యవహారమే కారణమా?
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో గణతంత్ర దినోత్సవం రోజున దారుణం జరిగింది. ఓ ఇంట్లో నలుగురు పిల్లలను గొంతుకోసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. మరో ప్రాంతంలో మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ హత్యలకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. సమర్ గార్డెన్‌లో ఓ ఇంట్లో రక్తపు మడుగులో నలుగురు పడివున్నారని ఆగంతకులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సదరు నివాసానికి చేరుకుని నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

ఆ ఇంటికి సుమారు 3కిలో మీటర్ల దూరంలో 40ఏళ్ల వయస్సున్న మహిళతోపాటు మరో వ్యక్తి(25) మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరందర్నీ పదునైన ఆయుధంతో గొంతుకోసి చంపేసినట్లు ఉందని పోలీసులు తెలిపారు. వీరిద్దరి మధ్య ఏదైన సంబంధం ఉండివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మృతి చెందిన మహిళను రుక్సానా(40)గా గుర్తించిన పోలీసులు, ఇంట్లో మృతి చెందిన నలుగురు పిల్లలను ఆమె సంతానంగా గుర్తించారు. ఆమెతోపాటు మృతి చెందిన వ్యక్తి గురించి ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఆస్తులకు సంబంధించిన కేసులో మృతురాలి భర్త జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.












Click it and Unblock the Notifications