ప్రధాని మోడీ సంకల్పం అద్భుతం: ఫ్రాన్స్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు మూడు రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ మధ్యాహ్నాం చండీగడ్‌కు రానున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా విమానంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోడీ దార్శనికత, సంకల్పం అద్భుతమని ఆయన కొనియాడారు. ఇరు దేశాల మధ్య రాఫెల్ జెట్ యుద్ధవిమానాల ఒప్పందం కుదరడం వెనుక ప్రధాని మోడీ ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఇరు దేశాలూ దీనిపై సంతకాలు చేశాయని గుర్తు చేసిన ఆయన, మిగతా అన్ని విషయాలూ పూర్తి అయ్యేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.
ఫ్రాన్స్ నుంచి 36 రఫాలే విమానాలు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, మోడీ ద్వైపాక్షిక విధానం తనకెంతో నచ్చిందని, ఓ బలమైన ఆశయంతో ఆయన ముందుకు సాగుతూ, ఇండియాను వృద్ధి పథంలో నడిపిస్తున్నారని హోలాండే కితాబిచ్చారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ దేశం చేస్తున్న పోరు ఆగదని, ఇందుకోసం ఇరు దేశాలూ కలిసి పనిచేయాలని కోరారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ దాడులపై భారత ప్రభుత్వం పాక్‌తో వ్యవహరిస్తున్న తీరు సరైనదని ఆయన కొనియాడారు. తన మూడు రోజుల పర్యనటలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఆదివారం చండీగడ్‌కు రానున్నారు.
ప్రధాని మోడీ ఆయనకు స్వాగతం పలుకనున్నారు. అనంతరం చండీగఢ్‌లో ఆదివారం జరగనున్న భారత్-ఫ్రాన్స్ బిజినెస్ సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రముఖ స్థలాలను సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం వారు ఢిల్లీ బయలుదేరుతారు. మంగళవారం జరిగే గణతంత్ర వేడుకలకు హొలాండే ముఖ్య అతిథిగా హాజరవుతారు.












Click it and Unblock the Notifications