G20 Summitలో అరుదైన దృశ్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని వేదికగా- ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం దీనికి వేదిక. జీ20లో సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చిస్తోన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మానుయెల్ మక్రాన్, చైనా ప్రధాని లి కియాంగ్, దక్షిణాఫ్రికా అధినేత సిరిల్ రమాఫోసా.. ఇలా పలువురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొద్దిసేపటి కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతోపన్యాసం చేశారు.

కాగా- ఈ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారమే జో బైడెన్ భారత్‌కు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. జీఈ జెట్ ఇంజిన్లు, న్యూక్లియర్ టెక్నాలజీ వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. పరిశోధన రంగంలో భారత్‌లోని పలు ఐఐటీలతో అమెరికన్ యూనివర్శిటీలు కలిసి పని చేయడం వంటి అంశాలతో కూడిన ప్రతిపాదనలపై సంతకాలు చేశారు.
ఐఐటీ- కాన్పూర్, ఐఐటీ- జోధ్‌పూర్, ఐఐటీ- బనారస్ హిందూ యూనివర్శిటీ, ఐఐటీ- ఢిల్లీలతో అమెరికా బఫెలోలోని స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్‌తో కలిసి పనిచేస్తాయి. ఐఐటీ- కాన్పూర్, ఐఐటీ హైదరాబాద్, ఇతర సంస్థలు కూడా భారత్ -యుఎస్ డిఫెన్స్ యాక్సిలరేషన్ ఎకోసిస్టమ్ కింద అకాడెమియా స్టార్టప్ పార్టనర్‌షిప్‌లో పాల్గొంటాయి. ఐఐటీ- బాంబే.. చికాగో క్వాంటమ్ ఎక్స్ఛేంజ్‌లో అంతర్జాతీయ భాగస్వామిగా చేరింది.

కాగా- నేడు జీ20 సదస్సు వేదిక వద్ద అరుదైన దృశ్యం కనిపించింది. స్వాగతోపన్యాసం ప్రారంభం కావడానికి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వేదిక వద్దకు వచ్చారు. అప్పటికే వేదిక వద్ద తనకు కేటాయించిన స్థానంలో కూర్చుని ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా.. బైడెన్‌ను చూసి, లేచి వెళ్లి ఆయనను చిరునవ్వుతో పలకరించారు.
బైడెన్ కూడా అంతే ఆప్యాయంగా హసీనాతో మాట్లాడారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం ఆమెతో సెల్ఫీ దిగారు. తన మొబైల్ ఫోన్‌తో షేక్ హసీనాతో కలిసి ఫొటో దిగారు. కొద్దిసేపు నిల్చునే వారిద్దరూ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను బంగ్లాదేశ్ హైకమిషనర్ కార్యాలయం విడుదల చేసింది.












Click it and Unblock the Notifications