గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతి: దీదీపై తండ్రి ఫిర్యాదు
కోల్‌కతా: సామూహిక అత్యాచారానికి గురై మంగళవారంనాడు మరణించిన 16 ఏళ్ల బాలిక తండ్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఫిర్యాదు చేశాడు. ఆరోగ్య శాఖ మమతా బెనర్జీ వద్దే ఉంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో బాలికను చేర్చారు. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాలిక మరణించిందని ఆమె తండ్రి ఆరోపిస్తున్నాడు.
బాలికపై నిరుడు అక్టోబర్ 25వ తేదీన సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను నిందితులు పదే పదే బెదిరిస్తూ వచ్చారు. దీంతో అమ్మాయి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మంగళవారంనాడు మరణించింది. బాలికను డిసెంబర్ 23వ తేదీన ఆస్పత్రిలో చేర్చారు.

అమ్మాయిపై ఆరుగురు వ్యక్తులు అక్టోబర్ 25వ తేదీన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తుండగా లాక్కెళ్లి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
అమ్మాయి మృతి చెందడంతో వామపక్షాలు ఆందోళనకు దిగాయి. అమ్మాయి శవాన్ని పోలీసులు బలవంతంగా తీసుకుని వెళ్లి అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications