మమత, ప్రశాంత్ కిషోర్ మధ్య స్పర్ధలు-ఐప్యాక్ పై టీఎంసీ నేతల గుర్రు-రేపు కీలక భేటీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించి, అనంతరం ఆమెను జాతీయ రాజకీయాల్లోనూ ప్రధానిని చేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కిషోర్ సంస్ధ ఐప్యాక్ తో తృణమూల్ కాంగ్రెస్ పోరు పెరుగుతోంది. ముఖ్యంగా తృణమూల్ అధికారంలోకి వచ్చాక కూడా మమతా బెనర్జీ ఐ ప్యాక్ సాయం తీసుకుంటుండగా.. ఆమె పార్టీ నేతలు మాత్రం పీకే టీమ్ జోక్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
టీఎంసీ కీలక నేత చంద్రిమా భట్టాచార్య తాజాగా ప్రశాంత్ కిషోర్ సంస్ధ ఐప్యాక్ చట్ట విరుద్ధంగా తన సోషల్ మీడియా ఖాతాల్ని వాడుతోందని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో విపక్షాలకు కూడా ఇదో వరంగా మారింది. ఎన్నికల ముందు ఐప్యాక్ తన పేరు మీద ట్విట్టర్ ఖాతా సృష్టించిందని, ఇవాళ అది తనకు తెలియకుండానే 'ఒక వ్యక్తి ఒక పోస్ట్' గురించి పోస్ట్ చేసిందని చంద్రిమ ఆరోపించారు. తాను దాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాని చంద్రిమ పీటీఐ వార్తాసంస్ధకు తెలిపారు. దీంతో ఈ వివాదం బహిర్గతమైంది.

దీనిపై స్పందించిన ఐ ప్యాక్.. తృణమూల్ కాంగ్రెస్ నేతలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను తాను నిర్వహించడం లేదని వివరణ ఇచ్చింది. అలా చేస్తున్నట్లు ఆరోపిస్తే మాత్రం అది కచ్చితంగా అబద్ధమేనని తెలిపింది. ఈ మేరకు చంద్రిమ చేసిన ఆరోపణల్ని ఐ ప్యాక్ తప్పుబట్టింది. వాస్తవానికి ఐప్యాక్ సాయంతో పార్టీని అంతర్గతంగా పునర్వ్యవస్థీకరించడానికి మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా 'ఒక వ్యక్తి, ఒకే పదవి' వ్యూహం అమలు తెరపైకి వచ్చింది. ఇది పార్టీలో సీనియర్లకు నచ్చలేదు. గత వారం త్వరలో జరిగే స్ధానిక ఎన్నికల కోసం రెండు పోటీ అభ్యర్థుల జాబితాలు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రచారంపై అంతర్గత వివాదం తలెత్తింది. ఆ తర్వాత అభిషేక్ మద్దతు ఉన్న ఐప్యాక్ పై మమతకు అనుకూలంగా ఉండే వర్గం దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇది కాస్తా వివాదాలకు దారి తీస్తోంది. దీంతో వివాదాల పరిష్కారానికి మమతా బెనర్జీ రేపు పార్టీ సీనియర్లతో కీలక భేటీకి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications