GATE 2022: వారి జీవితాలతో ఆడుకోలేం: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోజురోజుకూ వేలల్లో తగ్గుతూ వస్తోన్నాయి కోవిడ్ కేసులు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు హాట్‌స్పాట్‌గా మారిన రాష్ట్రాల్లో కేసుల తీవ్రత తగ్గింది. మరణాలు భారీగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజే వెయ్యిమందికి పైగా మృతి చెందారు. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత దాదాపు అన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌లను అమలు చేశాయి.

కోవిడ్ కేసులు తగ్గుముఖం..
తక్షణ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. ఫలితంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,72,433 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,59,107 మంది రికవరీ అయ్యారు. కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 1,008 మంది కోవిడ్ వల్ల మృత్యువాత పడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15,33,921కి చేరింది. ఇప్పటిదాకా 4,98,983 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 10.99 శాతంగా నమోదైంది.

గేట్ 2022 పరీక్షలపై..
కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ (గేట్) 2022 పరీక్షలను వాయిదా వేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గేట్ 2022 (GATE 2022) పరీక్షలను వాయిదా వేయడానికి నిరాకరించింది. ఈ పిటీషన్లను కొట్టి వేసింది. పరీక్షలను వాయిదా వేయమంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది.

పరీక్షల షెడ్యూల్ ఇదీ..
ఈ పిటీషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో గేట్ 2022 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్షల షెడ్యూల్ ప్రారంభం కావడానికి 48 గంటల ముందు మాత్రమే ఈ పిటీషన్‌ను దాఖలు చేయడాన్ని తప్పు పట్టింది. పరీక్షలను ఇప్పటికిప్పడు వాయిదా వేయడం వల్ల లక్షలాదిమంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతారని, అయోమయానికి గురవుతారని వ్యాఖ్యానించింది.

ఆ పరిస్థితులు లేవు..
ఇప్పటికే వారతా ఈ పరీక్షల కోసం సిద్ధమై ఉంటారని పేర్కొంది. కరోనా వైరస్ ఫస్ట్, సెకెండ్ వేవ్‌లల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని పిటీషన్ల తరఫు న్యాయవాది పల్లవ్ మోంగియా ధర్మాసనాన్ని అభ్యర్థించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో- 20 ప్రభుత్వ శాఖలు తమ పరీక్షలను వాయిదా వేసుకున్నాయని గుర్తు చేశారు. దీనిపై న్యాయమూర్తులు బదులిస్తూ- కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకెండ్‌వేవ్ నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని అన్నారు.
Recommended Video

అభ్యర్థుల భవిష్యత్‌తో ఆటలాడలేం..
పిటీషనర్లు కోరిన విధంగా తాము పరీక్షలను వాయిదా వేయలేమని తేల్చి చెప్పారు. అభ్యర్థుల భవిష్యత్‌తో ఆట్లాడుకోలేమని న్యాయమూర్తులు అన్నారు. తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు గేట్ 2022 పరీక్షల కోసం సన్నద్ధం అయ్యారని, 20 వేలమంది మాత్రమే దీనికి నిరాకరిస్తూ పిటీషన్లపై సంతకాలు చేశారని గుర్తు చేశారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేమని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే- లక్షలాది మంది అభ్యర్థులు గందరగోళానికి గురవుతారని అన్నారు.












Click it and Unblock the Notifications