Jeet Adani Diva Wedding: ఘనంగా అదానీ చిన్న కుమారుడి వివాహం
ప్రముఖ పారిశ్రామికవేత్తగా, ఆసియా సంపన్నుడు గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం ఘనంగా జరిగింది. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా షాతో జీత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గుజరాతీ సంప్రదాయ పద్ధతిలో ఈ జంట మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది.
అహ్మదాబాద్‌లోని అదానీ టౌన్ షిప్‌లో ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వివాహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ జైన్, గుజరాతీ సంప్రదాయంలో వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.
వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను గౌతమ్ అదానీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

సంప్రదాయ పద్ధతిలో, ఆత్మీయుల మధ్య తన కుమారుడి వివాహ వేడుక జరిగిందని పేర్కొన్నారు. అతి తక్కువ మంది సమక్షంలో జరిగిన ఈ వేడుకకు శ్రేయోభిలాషులను ఆహ్వానించలేకపోయినందుకు క్షమించాలని అభ్యర్థించారు. నవ దంపతులను ఆశీర్వదించాలని కోరుతూ జీత్-దివా వివాహ ఫొటోలను అదానీ పంచుకున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో చదువు పూర్తి చేసుకున్న జీత్ అదానీ 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు. 2023 మార్చిలో దివాతో జీత్ నిశ్చితార్థం జరిగింది. కాగా, ఈ పెళ్లి వేడుకకు పారిశ్రామిక దిగ్గజాలు ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ వంటి అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని ఇటీవల మహా కుంభమేళాలో పాల్గొన్న సందర్భంగా గౌతమ్ అదానీ తోసిపుచ్చారు.
परमपिता परमेश्वर के आशीर्वाद से जीत और दिवा आज विवाह के पवित्र बंधन में बंध गए।
— Gautam Adani (@gautam_adani) February 7, 2025
यह विवाह आज अहमदाबाद में प्रियजनों के बीच पारंपरिक रीति रिवाजों और शुभ मंगल भाव के साथ संपन्न हुआ।
यह एक छोटा और अत्यंत निजी समारोह था, इसलिए हम चाह कर भी सभी शुभचिंतकों को आमंत्रित नहीं कर सके,… pic.twitter.com/RKxpE5zUvs
భారతీయ సంప్రదాయాలు
జీత్-దివా వివాహం వేడుకలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల అద్భుతమైన సమ్మేళనం కనిపించింది. ఈ వివాహానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు, చేతివృత్తులవారు హాజరు కావడం వేడుకను మరింత ప్రత్యేకంగా చేసింది. అంతేకాకుండా, నాసిక్, మహారాష్ట్ర నుంచి వచ్చిన కళాకారులు అతిథుల కోసం పైథానీ చీరలను తయారు చేశారు. అలాగే, జోధ్‌పూర్‌కు చెందిన బిజాజీ చుడివాలా నుంచి వచ్చిన సాంప్రదాయ గాజులు వివాహ వేడుకలకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
దివ్యాంగులకు సాయం
జీత్ అదానీ, దివా షా వివాహ వేడుక సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. జీత్, దివా 500 మంది వికలాంగులైన మహిళల వివాహానికి ప్రతి సంవత్సరం రూ. 10 లక్షలు విరాళంగా అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కొత్తగా పెళ్లైన 21 మంది వికలాంగ జంటలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు అందివ్వడం ద్వారా ఇటీవల ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications