విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్: దేశీయ మార్గాలలో టిక్కెట్లపై భారీ డిస్కౌంట్
ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలు దేశీయ మార్గాలలో ఒకదానిని మించి మరొకటి తక్కువ ధరలకే విమాన టిక్కెట్లు ఆఫర్ చేస్తున్నాయి.
న్యూ ఢిల్లీ: విమానయాన రంగంలో పెరుగుతున్న రద్దీని ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలు బాగానే క్యాష్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, గో ఎయిర్ టిక్కెట్ ధరల యుద్ధంలో మరింతగా దూసుకుపోతున్నాయి. ఒకదానిని మించి మరొకటి తక్కువ ధరలను ఆఫర్ చేస్తూ ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
జెట్ ఎయిర్ వేస్
'గెట్ సెట్ ఫర్ ఫ్లయింగ్ స్టార్ట్' పేరుతొ తగ్గింపు ధరల పథకాన్ని జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద జనవరి 7 వరకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ పథకం ప్రకారం.. దేశీయ మార్గాలలో ఎంపిక చేసిన విమానాలలో అన్ని పన్నులను కలుపుకుని రూ.999కే టిక్కెట్లు అందించనుంది.

ఇండిగో
మరో ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా ఎంపిక చేసిన మార్గాలలో రూ.949కే విమాన టిక్కెట్లు అందిస్తోంది. ఈ బుకింగ్ ద్వారా టిక్కెట్లు కొన్న ప్రయాణికులు జనవరి 31 - ఏప్రిల్ 13 మధ్య ప్రయాణించవచ్చు.

కోయంబత్తూరు-చెన్నై రూ.949, న్యూఢిల్లీ-జైపూర్ రూ.1,042, చెన్నై-బెంగళూరు రూ.1,187, ఢిల్లీ-ముంబై రూ.2,214, చెన్నై-ఢిల్లీ రూ.2,832 ధరలకు టిక్కెట్లు అందిస్తున్నట్లు ఈ సంస్థ తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది.
గో ఎయిర్
గో ఎయిర్ కూడా ఎంపిక చేసిన మార్గాలలో రూ.1,057 నుంచి ప్రారంభమయ్యే టిక్కెట్లు ఆఫర్ చేస్తోంది. బుకింగ్స్ జనవరి 31 వరకు ఉంటాయని, ఈ పథకం కింద జైపూర్-ఢిల్లీ రూ.1,267, బెంగళూరు-గోవా రూ.1,692.. ఇంకా ఇతర ధరలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.

ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ ( డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ) లెక్కల ప్రకారం.. గత ఏడాది జనవరి-నవంబర్ నెలల మధ్య దేశంలో విమాన ప్రయానికుల సంఖ్య 23 శాతం పెరిగింది.
దేశీయ విమానయానంలో ఈ పెరుగుదలను దృష్టిలో ఉంచుకున్న ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రయాణికులకు ఈ తగ్గింపు టిక్కెట్ల ధరలు ప్రకటిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం ఆయా సంస్థల వెబ్ సైట్లను సందర్శించవచ్చు.












Click it and Unblock the Notifications