ఎంత లగేజీ కావాలంటే అంత మోసుకెళ్లే రోజులు పోయాయి
New Baggage Guidelines on Railways: ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ ఓ కొత్త షాక్ ఇచ్చింది. ఇష్టానుసారంగా లగేజీ/బ్యాగేజీని మోసుకెళ్లడానికి చెక్ పెట్టింది. దీనికి పరిమితులను విధించింది. ఇందులో భాగంగా విమానాల తరహాలో వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చింది.
నిర్దేశిత లగేజీ పరిమితులను కఠినంగా అమలు చేయనుంది. దీనికోసం కొన్ని నిబంధనలను ప్రయాణికులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. రైలు ప్రయాణాన్ని మరింత క్రమబద్ధీకరించడం, తొటి ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

తాజా నిబంధనల ప్రకారం- ప్రయాణీకులు తమ లగేజీని రైల్వే స్టేషన్ లో అందుబాటులో ఉండే ఎలక్ట్రానిక్ కాటాల వద్ద బరువును తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. అనుమతించిన బరువు కంటే ఎక్కువ లగేజీ/బ్యాగేజీ ఉన్నట్లు తేలితే అదనపు ఛార్జీలు లేదా జరిమానాలను విధిస్తారు.
ప్రయోగాత్మకంగా నార్త్ సెంట్రల్ జోన్‌లోని అన్ని ప్రధాన స్టేషన్లలో అమలు చేయనున్నారు. ప్రయాగ్రాజ్ జంక్షన్, ప్రయాగ్ రాజ్ ఛియోకి, సుబేదర్ గంజ్, కాన్పూర్ సెంట్రల్, మిర్జాపూర్, తుండ్లా, అలీఘర్ జంక్షన్, గోవింద్ పురి, ఇటావా వంటి స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ స్టేషన్లలోని ప్రయాణీకులు తమ లగేజీని తనిఖీ చేసి, నిర్దేశిత పరిమితుల్లో ఉంటేనే ప్లాట్‌ఫారమ్‌లకు అనుమతిస్తారు.
లగేజీ.. నిర్దేశిత బరువు కంటే తక్కువగా ఉన్నా సరే.. దాని పరిమాణంలో పెద్దగా ఉంటే కూడా అదనపు ఛార్జీలు లేదా జరిమానాలను కట్టాల్సి ఉంటుంది ప్రయాణికులకు. లగేజీ పరిమితులు రైలులోని ఒక్కో క్లాస్ కు ఒక్కో రకంగా నిర్ధారించారు.
- ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణీకులకు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లడానికి అనుమతిస్తారు.
- ఏసీ 2-టయర్ ప్రయాణికులు.. తమ వెంట 50 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు.
- ఏసీ 3-టయర్, స్లీపర్ క్లాస్ లో ప్రయాణించే వారికి 40 కిలోల వరకు లగేజీని అనుమతిస్తారు.
- జనరల్ క్లాస్ ప్రయాణీకులకు 35 కిలోల లగేజీకి మాత్రమే అనుమతి ఉంది.
- పెద్ద పరిమాణంలోని బ్యాగులను తీసుకెళ్తే- వాటి బరువుతో సంబంధం లేకుండా జరిమానాలు లేదా అదనపు ఛార్జీలను విధిస్తారు. సంబంధిత బ్యాగులు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకుంటాయనే ఉద్దేశంతో ఈ నిబంధనను రూపొందించారు రైల్వే అధికారులు.
తాజా నిబంధనల వల్ల దూర ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణీకులకు మరింత సమర్థవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించినట్టవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. వీటిని కఠినంగా అమలు చేస్తామని ప్రయాగ్ రాజ్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ హిమాన్షు శుక్లా తెలిపారు.












Click it and Unblock the Notifications