కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలో చేరిన గులాం నబీ ఆజాద్ మేనల్డుడు ముబషిర్ ఆజాద్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం, కాంగ్రెస్ అసమ్మతి నేత గులాం నబీ ఆజాద్ మేనల్లుడు ముబషిర్ ఆజాద్ ఆ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. జమ్మూకాశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడనై బీజేపీలో చేరినట్లు ఆయన తెలిపారు.
అయితే, పార్టీ మారడం గురించి తన మామయ్య గులాంనబీ ఆజాద్‌తో చర్చించలేదని ముబషిర్ తెలిపారు. ముబషిర్, ఆయన అనుచరులను జమ్మూకాశ్మీర్‌లో బీజేపీ పార్టీ జమ్మూకాశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా పార్టీలోకి ఆహ్వానించారు. ముబషిర్ బీజేపీలో చేరడం ద్వారా దోడా, కిష్త్వార్, రంబాన్ జిల్లాల్లోని మరింత మంది యువత బీజేపీలో చేరేందుకు ఆసక్తికనబరుస్తారని రవీందర్ చెప్పారు.

ప్రతిపక్ష పార్టీలతోపాటు అన్నివర్గాల నాయకులు, సామాజిక కార్యకర్తలు బీజేపీలో చేరుతున్నారని, వీరితో జమ్మూకాశ్మీర్ పార్టీ మరింత బలపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు రవీందర్. క్షేత్రస్థాయిలో మోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరులో కూరుకుపోయిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు ముబషిర్.
మాజీ సీఎం, పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ పట్ల ఆ పార్టీ వ్యవహరించిన తీరు ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ముబషిర్ విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా గులాం నబీ ఆజాద్ సేవలను ప్రశంసించారని గుర్తు చేశారు. గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సంస్థాగత నిర్మాణంలో మార్పు అవసరమంటూ ఎత్తిచూపిన 23 మంది సీనియర్ నేతల్లో ఆజాద్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత ఆజాద్ పై ప్రధాని మోడీ పలుమార్లు ప్రశంసలు కురిపించారు. కాగా, ఆజాద్ కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ ల మధ్య దూరం మరింతగా పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications