ప్రేమికులను రివాల్వర్ తో కాల్చి చంపి శవాలను మొసళ్లకు వేసేసి !
భోపాల్/మధ్యప్రదేశ్: యువతికి కేవలం 18 సంవత్సరాలు, ఇప్పుడిప్పుడే మీసాలు వస్తున్న 21 ఏళ్ల యువకుడు ఒకరినొకరు ప్రేమిస్తున్నాడు. యువతి కుటుంబ సభ్యుల వ్యతిరేకతను లెక్కచేయకుండా వీరి ప్రేమ కొనసాగింది. దీంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు కనికరం లేకుండా ప్రేమికులను కాల్చి చంపారు. అంతేకాదు వారి మృతదేహాలకు బరువైన రాళ్లను కట్టి మొసళ్లతో నిండిన చంబల్ నదిలోకి విసిరారు. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఈ షాకింగ్ కేసు వెలుగు చూసింది.
మొరెనా జిల్లా రత్నబసాయి గ్రామానికి చెందిన శివానీ తోమర్ అలియాస్ శివాని (18), అనే యువతి, రాధేశ్యామ్ (21) అనే యువకుడు ప్రేమించుకున్నారు. వయసులో ఉన్న ప్రేమికులు శివానీ, రాధేశ్యామ్ హ్యాపీగా తిరిగేశారు. శివాని ప్రేమను ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. యువతి శివాని నివాసం ఉంటున్న పొరుగు గ్రామమైన బలుపురాలో రాధేశ్యామ్ నివాసం ఉంటున్నాడు. రాధేశ్యామ్ తండ్రి ఫిర్యాదుతో కేసు వెలుగులోకి వచ్చింది.

తన కొడుకు రాధేశ్యామ్, శివాని అనే యువతి చాలా రోజులుగా కనిపించడం లేదంటూ రాధేశ్యామ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధేశ్యామ్ హత్యకు గురై ఉంటాడని అతని తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. ప్రేమికులు శివాని, రాధేశ్యామ్ ఇద్దరూ పారిపోయి ఉండొచ్చని తొలుత పోలీసులు అనుమానించారు. అయితే ప్రేమికులు గ్రామం నుంచి పారిపోవడం గ్రామంలో ఎవరూ చూడలేదు.

పోలీసులు కేసు నమోదు చేసి యువతి శివాని తండ్రి, బంధువులను విచారించారు. గంటల తరబడి విచారించిన యువతి శివాని తల్లిదండ్రులు తమ కుమార్తెను, ఆమె ప్రేమికుడు రాధేశ్యామ్ ను తామే హత్య చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు హడలిపోయారు. జూన్ 3వ తేదీన రాధేశ్యామ్, శివానీలను కాల్చి చంపామని, తరువాత ఇద్దరి మృతదేహాలను రాళ్లతో కట్టి మొసళ్లతో నిండిన చంబల్ నదిలో విసిరినట్లు యువతి శివాని తల్లిదండ్రులు పోలీసుల విచారణలో అంగీకరించారు.

ప్రియురాలి శివాని కుటుంబ సభ్యులను విచారించగా నేరం అంగీకరించారు. ప్రేమికులు శివానీ, రాధేశ్యామ్ లను హత్య చేసి మృతదేహాలను చంబల్ నదిలో పడేసినట్లు యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్‌ల సహాయం తీసుకున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. చంబల్ ఘరియాల్ అభయారణ్యంలో 2 వేలకుపైగా నీటి మొసళ్లు ఉన్నాయని అధికారులు అంటున్నారు. శివానీ, రాధేశ్యామ్ ల శవాల కోసం గాలిస్తున్నామని పోలీసుల అంటున్నారు. అయితే మొసళ్లు రాధేశ్యామ్, శివానీల శవాలను తినేసి ఉంటాయని ప్రియుడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications