పెళ్లి కోసం ఒత్తిడి చేస్తోందని.. చెల్లెలి గొంతుకోసి చంపేసింది
పాట్నా: బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన పెళ్లి కోసం తల్లితండ్రులపై ఒత్తిడి చేస్తోందని ఆగ్రహానికి గురైన ఓ యువతి తన చెల్లెలిని అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేసింది. ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.
ఈ ఘటన గోపాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మనోహర్ కచురా గ్రామంలో అఖిలేష్ యాదవ్ అనే వ్యక్తి గృహంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అల్కా.. గత కొంతకాలంగా తన సోదరి ప్రియాంక వివాహం కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తోంది.
వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని అల్కా సోదరి ప్రియాంక ఆదివారం రాత్రి ఆమెతో వాగ్వాదానికి దిగింది. ఆగ్రహానికి గురైన ప్రియాంక అదే రాత్రి నిద్రిస్తున్న సమయంలో కత్తితో అల్కా గొంతును కోసేసింది. అయితే ప్రియాంకను కాపాడుకునేందుకు మొదట ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అల్కాను హత్య చేసి పరారయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన సమయంలో ఇంటి తలుపులు లాక్ చేసివున్నాయని గుర్తించిన పోలీసులు, ఇంట్లోని వ్యక్తులే హత్య చేసివుంటారని అనుమానించారు. ఈ కోణంలోనే తమ విచారణను కొనసాగించారు. ఆ రోజు రాత్రి అల్కాతో నిద్రించిన ప్రియాంకను పోలీసులు తమదైన శైలిలో విచారించారు.
పోలీసుల విచారణలో ప్రియాంక.. తానే హత్య చేసినట్లు ఒఫ్పుకుంది. తనకు చదువుకోవాలని ఉన్నా.. తన వివాహం కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి చేయడంతో తానే తన చెల్లెలు అల్కాను కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు తెలిపింది. కాగా, తమ విచారణలో ప్రియాంకకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నట్లు తేలిందని నగర ఎస్పీ(ఈస్ట్) సుధీర్ కుమార్ పొరిక తెలిపారు. భిన్న కోణాల్లో విచారణ జరిపి హత్యను ఛేధించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications