క్యాంపస్ లో గ్యాంగ్ వార్: విద్యార్థినికి బుల్లెట్ గాయం
ఘజియాబాద్: కాలేజ్ విద్యార్థుల గ్యాంగ్ వార్ కారణంగా విద్యార్థిని శరీరంలోకి బుల్లెట్ దూసుకు వెళ్లిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బాధితురాలిని సరైన సమయంలో ఆసుపత్రికి తరలించి శాస్త్ర చికిత్స చెయ్యడంతో నెమ్మదిగా కోలుకుంటున్నది.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ ఎయిమ్స్ కాలేజ్ లో ఎంబీఏ రెండవ సంవత్సరం చదువుతున్న శివనాగి అగర్వాల్ (20) అనే విద్యార్థికి బుల్లెట్ గాయాలైనాయి. పోలీసు అధికారి రాజ్ కుమార్ యాదవ్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఎయిమ్స్ కాలేజ్ లో అభిషేక్ సింగ్ సిద్దు విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఘజియాబాద్ లోని లా కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్న నవతేజ్, అభిషేక్ ల మధ్య చాల కాలం నుండి గొడవలు ఉన్నాయి. ఇరు వర్గాలు అనేక సార్లు పరస్పరం దాడులు చేసుకున్నారు.

శివనాగి అగర్వాల్, అభిషేక్ సింగ్ ఒకే కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నారు. బుధవారం ఉదయం 9.50 గంటల సమయంలో అభిషేక్ కాలేజ్ క్యాంపస్ లో ఉన్నాడు. అదే సమయంలో శివనాగి అగర్వాల్ కాలేజ్ క్యాంపస్ లో పరీక్షలు వ్రాయడానికి నడిచి వెళుతున్నది.
బయట నుండి బైక్ లో వచ్చిన నవతేజ్ జేబులో ఉన్న రివాల్వర్ తీసుకుని అభిషేక్ మీద కాల్పులు జరిపాడు. అయితే ట్రిగర్ నొక్కినప్పుడు బైక్ పక్కకు పోవడంతో ఆ బుల్లెట్ శివనాగి అగర్వాల్ వీపులో దూసుకు వెళ్లింది. నవతేజ్ అక్కడి నుండి పరారైనారు.
శివనాగి అగర్వాల్ ను ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. శాస్త్ర చికిత్స చేసి అమె శరీరంలో ఉన్న బుల్లెట్ బయటకు తీశారు. నవతేజ్, అభిషేక్ సింగ్ ల మీద కేసు నమోదు చేశామని, శివనాగి అగర్వాల్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని పోలీసు అధికారి రాజ్ కుమార్ యాదవ్ చెప్పారు. పరీక్షలు జరిగే సమయంలో కాలేజ్ క్యాంపస్ లో షూట్ ఔట్ జరగడంతో పోలీసులు గట్టిబందోబస్తు ఎర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications