రైతులకు షాక్: భారీగా పెరిగిన ఎరువుల ధరలు..
మధ్యప్రాచ్యంలో ముసిరిన యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతన్నల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మొదలైన ఈ పోరు కేవలం ఆయుధాలకే పరిమితం కాకుండా, పొలాల్లో పండాల్సిన పంటలపై తన ప్రతాపాన్ని చూపుతోంది. ముఖ్యంగా రసాయన ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సాగు భారమై రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అమెరికాలోని సౌత్ డకోటా నుంచి ఆస్ట్రేలియా పొలాల వరకు ఇదే ఆందోళన కనిపిస్తోంది.
ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల ఎరువుల తయారీకి అత్యంత కీలకమైన సహజ వాయువు (Natural Gas) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూరియా, అమోనియం, ఇతర NPK ఎరువుల తయారీలో గ్యాస్ ప్రధాన ముడి పదార్థం కావడంతో, ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీని ప్రభావం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే టన్ను యూరియా ధర 470 డాలర్ల నుంచి ఏకంగా 550 డాలర్ల మార్కును దాటేసింది. సాధారణంగా ఒక రైతు సాగు ఖర్చులో ఎరువుల వాటా 50 శాతం వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ ధరల పెరుగుదల నేరుగా రైతుల ఆర్థిక వెన్నుముకను విరుస్తోంది.

హార్ముజ్ సెగ.. రెట్టింపు కానున్న ధరలు?
ప్రపంచ ఎరువుల సరఫరాలో మూడో వంతు వాటా కలిగిన 'హార్ముజ్ జలసంధి'ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడం ఈ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తోంది. విశ్లేషకుల అంచనా ప్రకారం, ఈ సరఫరా గొలుసులో అంతరాయం ఇలాగే కొనసాగితే.. మున్ముందు నత్రజని (Nitrogen) ఎరువుల ధరలు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఫాస్ఫేట్ ఎరువుల ధరలు కూడా 50 శాతం మేర పెరగవచ్చు. పశ్చిమాసియా వివాదం వల్ల చమురు ధరలు కూడా పెరుగుతుండటంతో, రవాణా ఖర్చులు పెరిగి వ్యవసాయ వాణిజ్యం అతలాకుతలమవుతోంది.
దిగుబడులపై యుద్ధ ప్రభావం
ఎరువుల కొరత ఏర్పడితే అది నేరుగా దిగుబడులపై పడుతుంది. దిగుబడులు తగ్గితే మార్కెట్‌లో ధాన్యం, బియ్యం వంటి ఆహార పదార్థాల లభ్యత తగ్గిపోయి కృత్రిమ కొరత ఏర్పడుతుంది. "పొలంలో పంట పండి మన పళ్లెంలోకి రావడానికి 6 నుండి 9 నెలల సమయం పట్టవచ్చు కానీ, వచ్చే క్రిస్మస్ నాటికి ఆహార ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుందని" నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో పదివేల ఎకరాల్లో మొక్కజొన్న పండించే రైతుల నుంచి, ఆగ్నేయాసియాలోని చిన్న పామాయిల్ రైతుల వరకు అందరూ ఇప్పుడు ఎరువుల కోసం అల్లాడుతున్నారు.
చిన్న రైతులకు గండం.. ఆహార భద్రతకు ముప్పు!
పెద్ద రైతులు ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటున్నా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని చిన్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఎరువులు కొనలేక చాలామంది సాగునే వదిలేసే ప్రమాదం ఉంది. పోలాండ్ వంటి దేశాల్లోనైతే రసాయన ఎరువులు దొరకక, రైతులు పశువుల పేడ కోసం ఇరుగుపొరుగు వారిని ఆశ్రయిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం సృష్టించిన గాయాల నుంచి ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో.. ఈ మధ్యప్రాచ్య పోరు గ్లోబల్ సౌత్ దేశాల్లో తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని, ఆహార కొరతను సృష్టించేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications