వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూతాపం: 'ఇకనైనా మేలుకోకుంటే మరణమే..' పర్యావరణ శాస్త్రవేత్తల తుది హెచ్చరిక

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భూమి

పెరుగుతున్న భూతాపం మానవజాతిని కబళించే రోజు ఎంతో దూరం లేదంటూ శాస్త్రవేత్తలు అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు.

పారిశ్రామిక విప్లవం ముందు నాటి సగటు కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వరాదన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేని స్థాయిలో సత్వరం ఫలితమిచ్చే చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

''1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా నియంత్రించడం లక్ష్యమైనప్పటికీ ఇప్పటికే ఉష్ణోగ్రతలు దాన్ని మించిపోయే దశలో ఉన్నాయి. అదే జరిగితే దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను నివారించడానికి ఇప్పటికీ ప్రపంచ దేశాలకు అవకాశముంది'' అంటూ నివారణోపాయాలనూ సూచిస్తున్నారు.

మూడేళ్ల అధ్యయనం.. అనంతరం దక్షిణ కొరియాలో వారం పాటు శాస్త్రవేత్తలు, అధికారుల మధ్య సమగ్ర చర్చ తరువాత 'ఇంటర్‌ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్' (ఐపీసీసీ) భూఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరిగితే ఆ ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై కీలక నివేదిక విడుదల చేశారు.

శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధుల మధ్య చర్చల సారాంశాన్ని ఆ నివేదికలో పొందుపరిచారు. ఇందులో కొన్ని విషయాల్లో రాజీపడినట్లుగా కనిపిస్తున్నప్పటికీ పలు అంశాలపై విస్పష్టమైన సూచనలు చేశారు.

''ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కే పరిమితం చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలుంటాయి. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ఫలితాలను ఇది తగ్గిస్తుంద''ని ఐపీసీసీ ఉపాధ్యక్షుడు జిమ్ స్కీ అన్నారు.

''భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పరిమితం చేయాలనుకుంటే చేపట్టాల్సిన మార్పులపై ఆలోచించాలి. ఇంధన వ్యవస్థలో తేవాల్సిన మార్పులు.. భూవినియోగం తీరుతెన్నుల్లో మార్పులు.. రవాణా రంగంలో తీసుకురావాల్సిన మార్పులు అన్నీ ఆలోచించాలి'' అని అభిప్రాయపడ్డారు.

భూతాపం

టార్గెట్ 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్

'తక్షణం చర్యలు తీసుకోండి' అని పెద్దపెద్ద అక్షరాలతో రాయాలని శాస్త్రవేత్తలు అనుకునే ఉంటారు. వారు వాస్తవాలను, గణాంకాలను చూపుతూ ఆ మాట చెప్పాల్సి ఉందని చర్చల్లో పరిశీలకురాలిగా పాల్గొన్న గ్రీన్ పీస్ సంస్థ ప్రతినిధి కైసా కొసోనెన్ అన్నారు.

ఈ శతాబ్దంలో ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించకుండా చూస్తే వాతావరణ మార్పుల కారణంగా కలిగే ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు నియంత్రించగలుగుతామన్న ఇంతకుముందు ఉండేది. కానీ, 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించి ఉష్ణోగ్రతలు పెరిగితే భూమిపై జీవనయోగ్యత విషయంలో పాచికలాడినట్లేనని ఈ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది.

ఈ పరిమితి సాధ్యమే.. అయితే, ఇది అత్యవసరంగా జరగాల్సి ఉంది. ప్రభుత్వాలు, వ్యక్తులు.. ఇలా ప్రతి స్థాయిలో భారీ ఎత్తున మార్పులు రావాల్సి ఉంది. అంతేకాదు, రెండు దశాబ్దాల పాటు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 2.5 శాతం ఇలాంటి చర్యల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదిక సూచించింది.

అప్పుడు కూడా వాతావరణంలోని కర్బనాన్ని సంగ్రహించడం కోసం చెట్లు ఉండాలి, సంగ్రహణ యంత్రాలను ఉపయోగించాలి. అలా సంగ్రహించిన కర్బనాన్ని భూగర్భంలో పాతరేయాలి. ఈ ప్రక్రియ నిత్యం కొనసాగుతుండాలి.

సైకిల్ ప్రయాణం

మనమేం చేయాలి?

ప్రధానంగా ఇంధన, భూవినియోగం, నగరాలు, పరిశ్రమల వ్యవస్థల్లో సమూల మార్పలు తెస్తేనే భూతాపాన్ని అనుకున్న స్థాయిలో తగ్గించగలమని ఈ నివేదిక వెల్లడించింది.

అయితే, వ్యవస్థలతో పాటు మనిషి తనకు తాను ఇలాంటి మార్పులను నిర్దేశించుకోకుంటే లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. ఇందుకు గాను వ్యక్తిగతంగా తీసుకురావాల్సిన మార్పులనూ ఈ నివేదిక సూచించింది.

* మాంసం, పాలు, వెన్న వంటి ఉత్పత్తులను కొనడం తగ్గించాలి. అలాగే వాటిని వృథాగా పారబోయడమూ తగ్గించాలి.

* తక్కువ దూరాలకైతే నడుచుకుంటూ లేదంటే సైకిళ్లపై వెళ్లాలి. ఎక్కువ దూరాలకు ఎలక్ట్రిక్ కార్లను వినియోగించాలి.

* విమాన ప్రయాణాలు తగ్గించుకుని బస్సులు, రైళ్లలో రాకపోకలు సాగించాలి.

* వ్యాపార పరమైన సమావేశాల కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి అందరూ ఒక చోటికి వచ్చే కంటే వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

* దుస్తులు ఎండబెట్టేందుకు డ్రయ్యర్లను వాడేకంటే చక్కగా తాడుకట్టి దానిపై ఆరబెట్టడం మంచిది.

* కొనుగోలు చేసే ప్రతి వస్తువూ కర్బన రహితమో.. లేదంటే తక్కువ కర్బనాలను విడుదలచేసేదో అయ్యుండేలా చూసుకోవాలి.

జీవనశైలిలో ఇలాంటి మార్పులను తీసుకురావడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఐపీసీసీకి చెందిన మరో ఉపాధ్యక్షురాలు డెబ్రా రాబర్ట్స్ చెప్పారు.

ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించడానికి 5 మార్గాలు

* 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు 2010 నాటి స్థాయితో పోల్చితే 45 శాతం తగ్గాలి.

* 2050 నాటికి ప్రపంచ విద్యుత్ అవసరాలలో 85 శాతం పునరుత్పాదక ఇంధన వనరులే తీర్చాలి.

* బొగ్గు వినియోగాన్ని పూర్తిగా ఆపేయాలి.

* ప్రపంచవ్యాప్తంగా 70 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంధన పంటలు(జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడే మొక్కలు) ఉండాలి. అంటే సుమారు ఆస్ట్రేలియా అంత విస్తీర్ణంలో జీవఇంధనాల తయారీకి ఉపయోగపడే మొక్కలను సాగు చేయాలన్నమాట.

* 2050 నాటికి కర్బన ఉద్గారాలను శూన్య స్థితికి చేర్చాలి.

భూతాపం

దీనంతటికీ ఎంత ఖర్చవుతుంది?

ఇవన్నీ చౌకగా ఏమీ సాధ్యం కావు. భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించే దిశగా సాగాలంటే ఒక్క ఇంధన రంగంలోనే ప్రపంచవ్యాప్తంగా 2016 నుంచి 2035 మధ్య కాలంలో ఏటా 2 కోట్ల 40 లక్షల డాలర్ల మేర వెచ్చించాల్సి ఉంటుంది.

'చేసే ఖర్చుకు దక్కే ప్రయోజనాలకు మధ్య సమతుల్యత చూడాల'ని ఐపీసీసీలో ఇంతకుముందు బ్రిటన్ తరఫున చర్చల్లో పాల్గొన్న స్టీఫెన్ కార్నెలియస్ వ్యాఖ్యానించారు.

తక్కువ సమయంలో ఇలా ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించడం ఖర్చుతో కూడిన పనే.. అయితే, వాతావరణం నుంచి కర్బనాలను సంగ్రహించడంతో పోల్చితే ఇది చౌకే అని చెప్పాలి.

మంచు

మేల్కోకుంటే మరణమేనా?

ఉష్ణోగ్రతలను లక్ష్యం మేరకు నియంత్రించలేకపోతే అత్యంత దారుణ పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగితే సముద్ర మట్టాలు 10 సెంటీమీటర్లు పెరిగి భూమి మీద చాలా ప్రాంతాలు నీట మునిగిపోతాయి. అదే ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కే పరిమితం చేయగలిగితే కనీసం కోటి మందిని జనాభాను ముప్పు నుంచి బయటపడేయొచ్చు.

వరి, జొన్న, గోధుమలు వంటి పంటలపైనా తీవ్ర ప్రభావం పడుతుంది.

''ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ మేర భూతాపం పెరిగితేనే మనం ముప్పులో పడతాం. ధ్రువాల్లో మంచు కరిగే వేగం మరింత పెరుగుతుంది. ఇప్పుడు మనం భూమ్మీద వేసవిలో చూస్తున్న వేడిమి ఒక మోస్తరుది మాత్రమే.. అప్పుడు పూర్తిగా మంటల్లో ఉన్నట్లుంటుంది'' అంటూ కైసా కోసోనెన్ భవిష్యత్తను కళ్ల ముందుంచారు.

అంతా నేతల చేతుల్లోనే..

భూతాపాన్ని తగ్గించడానికి ఏమాత్రం గడువు లేదు. వెంటనే స్పందించాల్సిందే. కానీ, ఇప్పుడిది ప్రభుత్వాధినేతలు, రాజకీయ నేతల చేతుల్లో ఉంది. భూమిని రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన కఠిన చర్యలను పట్టాలెక్కించడానికి ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేదు. ప్రపంచ దేశాలు ఇప్పుడు కానీ స్పందించకపోతే ఆ తరువాత వారు వాతావరణంలోని కర్బనాన్ని సంగ్రహించడానికి ఇంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది.

''సత్వరం మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందే. ఇంతకుముందు పారిస్ ఒప్పందం చేసిన ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉన్నంత మాత్రాన సరిపోదు'' అని ప్రొఫెసర్ జిమ్ స్కీ అన్నారు.

ప్రపంచదేశాల నేతలు ఈ నివేదికను చదివి వారి లక్ష్యాలను పెంచుకోవడానికి నిర్ణయించడంతో పాటు వెంటనే కార్యరంగంలోకి దిగితే భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించడం అసాధ్యమేమీ కాదని జిమ్ అభిప్రాయపడ్డారు.

పర్యావరణవేత్తలు, భూతాప నివారణకు పనిచేస్తున్నవారు ఈ అంశంపై మాట్లాడుతూ, ముప్పు ముంచుకొస్తుండడంతో దీనిపై చర్చించడానికి కూడా సమయం లేదని, మార్పులకు సత్వరం శ్రీకారం చుట్టాల్సిందేనని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Global warming: Ecologists warn if not taken care now this will lead to death
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X