Go First : గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ దివాళా-అర్ధాంతరంగా విమానాల నిలిపివేత..!
దేశంలో ప్రైవేటు రంగంలో ఉన్న విమానయాన సంస్ధల్లో ఒకటైన గో ఫస్ట్ దివాళా తీసింది. తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న గో ఫస్ట్ యాజమాన్యం ఇవాళ జాతీయ లా ట్రైబ్యునల్ ముందు దివాళా పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు స్వచ్ఛంద దివాళా పిటిషన్ దాఖలు చేసినట్లు సంస్ధ ప్రతినిధులు ప్రకటించారు. అలాగే ప్రస్తుతం గో ఫస్ట్ నడుపుతున్న అన్ని విమానాల్ని తాత్కాలికంగా రద్దు చేసింది.
తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్ బుధ, గురువారాల్లో విమానాలను నిలిపివేస్తోంది. యూఎస్ సంస్థ ప్రాట్ & విట్నీ (P&W) నుండి స్పేర్ ఇంజన్‌లను తెచ్చుకోవడంలో విఫలమైన గో ఫస్ట్.. ప్రస్తుతం తమకున్న విమానాల్లో 50 శాతం విమానాలను మాత్రమే నడుపుతోంది. ఈ స్పేర్ ఇంజన్లకు భారీ డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో భారీ ఎత్తున నిధులు వెచ్చించి కొనుగోలు చేసే పరిస్ధితి లేకపోవడం కూడా సంస్ధ దివాళాకు కారణంగా తెలుస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో ముంబై వాడియా గ్రూప్‌కు చెందిన గో ఫస్ట్ క్యారియర్.. ఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం దాఖలు చేసింది. ఇదో దురదృష్టకర నిర్ణయమని దివాళా పిటిషన్ దాఖలుపై సంస్ధ స్పందించింది. కంపెనీ ప్రయోజనాలను పరిరక్షించడానికి మాత్రం తప్పలేదని వెల్లడించింది. వాస్తవానికి సోమవారం నాటికే తాము ప్రస్తుతం నడుపుతున్న 50 విమానాల్లో సగం నిలిపేసిన గో ఫస్ట్.. ఇవాళ మిగతావి కూడా నిలిపేయాలని నిర్ణయించింది.
విమానయాన రంగంలో కరోనా తర్వాత చాలా వేగంగా ఆదాయాలు తగ్గిపోయాయి. ఇది గో ఫస్ట్ తో పాటు పలు చిన్న కంపెనీలపై భారీ ప్రభావం చూపింది. ఈ పరిణామాలు గో ఫస్ట్ ఎయిర్ లైన్స్ లో నిధుల కొరతకు దారితీసింది. ఈ ఏడాది ఏప్రిల్ 27 నాటికి కనీసం 10 సర్వీసబుల్ స్పేర్ లీజు ఇంజిన్‌లను సరఫరా చేయాలని సింగపూర్ మధ్యవర్తి యూఎస్ లో ఇంజన్ల సరఫరా సంస్ధను ఆదేశించినా.. ఇది అమలైతే ఆగస్టు లేదా సెప్టెంబర్లో తిరిగి పూర్తిస్ధాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తామని గో ఫస్ట్ చెబుతోంది.












Click it and Unblock the Notifications