వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Godavari Floods-Konaseema : గోదావరి ఏటిగట్లకు 12 చోట్ల పొంచి ఉన్న ప్రమాదం.. భయాందోళనల్లో కోనసీమ గ్రామాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
వరదలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసు సిబ్బంది

ఎగువన గోదావరి కాస్త శాంతించింది. భద్రాచలం వద్ద కూడా నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. కానీ ఏపీలోని ఆరు జిల్లాల పరిధిలో వరద తీవ్రత ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా కోనసీమ భయాందోళనతో కనిపిస్తోంది. కోనసీమలోని కరకట్టల పరిస్థితి కారణంగా కలవరం కలుగుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల బలహీనతలు బయటపడ్డాయి. ఏటిగట్ల పరిరక్షణ కోసం నీటిపారుదల శాఖ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. కానీ అవి ఫలిస్తాయా లేదా అనే ప్రశ్నలు మాత్రం ఉత్పన్నమవుతున్నాయి.

ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దాదాపు 25లక్షల క్యూసెక్కుల నీటిని డిశ్చార్జ్ చేస్తున్నారు. నిన్నటి వరకూ ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వేసిన అంచనాలను ఇప్పటికే భారీ వరద తాకిడి అధిగమించేసింది. దాంతో నీటి ప్రవాహం 28లక్షల క్యూసెక్కుల వరకూ ఉంటుందని తాజాగా ప్రభుత్వం వెల్లడించింది. దానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని యంత్రాంగానికి సూచించింది.

పోలవరం ఎగువన ప్రమాదకర స్థాయిలో ప్రవాహం..

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శనివారం సాయంత్రానికి నీటిమట్టం 21.3 అడుగులకు చేరిపోయింది. దాంతో 25లక్షల వరకూ వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

భద్రాచలం వద్ద శనివారం ఉదయానికి 70.9 అడుగులుగా నీటిమట్టం నమోదయ్యింది. ఇది 1986 తర్వాత అత్యధికం. 1990లో కూడా 70.2గా నమోదయ్యింది. చరిత్రలో కేవలం మూడుసార్లు మాత్రమే 70 అడుగులు దాటగా ఇది మూడోసారి కావడం విశేషం.

అయితే శనివారం ఉదయం 9గం.ల తర్వాత నుంచి క్రమంగా నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. సాయంత్రానికి 69 అడుగుల చేరువలోకి వచ్చింది. దాంతో భద్రాచలం పెనుగండం నుంచి గట్టెక్కినట్టుగా అంతా భావిస్తున్నారు.

భద్రాచలం వాసులకు ఉపశమనం దక్కినప్పటికీ పోలవరం ముంపు మండలాల్లో మాత్రం వరద తాకిడి కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద దాదాపుగా 39 అడుగులకు నీటిమట్టం చేరింది.

దాంతో ముంపు మండలాలు వీఆర్ పురం, కూనవరం, వేలేరుపాడు, కుకునూరుతో పాటుగా దేవీపట్నం, పోలవరం మండలాల్లోని నిర్వాసిత గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. వేలాది మంది ఏజన్సీ వాసులు కొండలపై తల దాచుకోవాల్సి వచ్చింది. మండల కేంద్రాల్లో కూడా పీకల్లోతు నీరు చేరింది. అనేక ఇళ్లు జలమయమయ్యాయి.

ఎటపాక పోలీస్ స్టేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు నీటమునిగాయి. కూనవరంలోని సివిల్ సప్లయిస్ గొడౌన్ లో కూడా వరద నీరు చేరింది. ఆహారధాన్యాలు నీటిపాలయ్యాయి. వేలేరుపాడులో కూడా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు భవనాలు నీటిలో మునిగిపోయాయి. జనం ఇళ్లన్నీ ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఆయా ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితి కొనసాగుతోంది. స్పిల్ వే 48 గేట్లు ఎత్తేసి పోలవరం నుంచి నీటిని వదులుతున్నప్పటికీ గోదావరి సహజ ప్రయాణానికి అవకాశం లేనందున వరద మరికొన్ని గంటల పాటు కొనసాగవచ్చని అల్లూరి జిల్లా అధికారులు భావిస్తున్నారు.

కోనసీలో ఏటి గట్లకు సమాంతర స్థాయిలో గోదావరి ప్రవాహం ఉండటంతో గట్లపై ఇలా ఇసుక బస్తాలు పేర్చారు

ఉలిక్కిపడుతున్న కోనసీమ..

ధవళేశ్వర్యం బ్యారేజ్ కి దిగువన ఉన్న కోనసీమలో తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. 2006 తర్వాత ఏటిగట్లు పటిష్టం చేయడంతో పలు వరదలను తట్టుకుని నిలబడ్డాయి. అయితే ఇటీవల ఇసుక లారీలు సహా అనేక కారణాలతో ఏటిగట్లు కొంత మేరకు దెబ్బతిన్నట్టుగా కనిపిస్తున్నాయి. అలాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం ఊళలు బయలుదేరాయి. ఇప్పటికే పి గన్నవరం మండలం నాగుల్లంక సమీపంలో నీటి లీకులు కూడా రావడంతో ఏటిగట్ల పరిస్థితిపై భయాందోళన వ్యక్తమవుతోంది.

గతంలో నాగుల్లంకకి ఎగువని మొండెపులంక సమీపంలో 2006లో గండిపడింది.

శనివారం మధ్యాహ్నానికే నాగుల్లంక వద్ద నీటిలీకులు చూసిన స్థానికులు అనేకమంది గత అనుభవాలతో జాగ్రత్తకు సన్నద్ధమవయ్యారు. అనేక మంది ఇళ్లు ఖాళీ చేశారు.

ఇక మామిడికుదురు మండలం పాశర్లపూడి, రాజోలు మండలంలోని పొదలాడ, సోంపల్లి గ్రామాల సమీపంలోని గోదావరి ఏటిగట్లు పై నుంచి వరద నీరు పారడంతో ప్రమాదకర స్థితి ఏర్పడింది. ఏక్షణంలోనయినా ముప్పు వాటిల్లవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

రంగంలోకి విపత్తు నిర్వహణ బృందాలు

గోదావరి ఏటిగట్లు కలవరపెడుతున్న తరుణంలో ప్రమాదం ఎదురుకాకుండా నష్ట నివారణకు ఇరిగేషన్ సిబ్బందితో పాటుగా విపత్తు నిర్వహణ బృందాలు రంగంలో దిగాయి. ఇసుక బస్తాలతో ఏటిగట్లు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. నాగుల్లంక వద్ద యుద్ద ప్రాతిపదికన లీకులు అరికట్టే ప్రయత్నం మొదలెట్టారు. అయితే అవి కొలిక్కి వస్తాయా రావా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

ఆదివారం ఉదయం వరకూ ధవళేశ్వరం వద్ద నీటి మట్టం పెరుగుదల అనివార్యంగా ఉంది. దాదాపుగా 22 అడుగులకు చేరువకావచ్చని భావిస్తున్నారు. దాంతో ఆ స్థాయి వరద వస్తే ఏమేరకు ఏటిగట్టు నిలుస్తాయన్నదే ఇప్పుడు సందేహాలకు తావిస్తోంది.

"1986 వరదల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఏటిగట్లు ఎత్తు చేశారు. కానీ వాటి నిర్వహణ వదిలేశారు. 2006 తర్వాత రెండు భారీ వరదలు వచ్చినా ఆ గట్లు కారణంగా నష్టం లేకుండా కోనసీమ ఊపిరిపీల్చుకుంది. కానీ ఇటీవల నిర్వహణ లోపంతో పాటుగా ఇసుక లారీల రాకపోకలు పెద్ద సమస్యగా మారాయి. 10 టన్నులు, 20 టన్నుల లోడుతో వెళ్లే వాహనాల మూలంగా గట్లు బలహీనపడ్డాయి. అలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నాగుల్లంక, రాజోలు వంటి ప్రాంతాల్లో ఇసుక ర్యాంపుల సమీపంలోనే ఏటిగట్లు ప్రమాదకరంగా మారడం దానికి నిదర్శనం" అని అంబాజీపేటకు చెందిన కే ఎస్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

ఈవరదల నుంచి గట్టెక్కేందుకు శనివారం రాత్రి అంతా గట్టి చర్యలు తీసుకుంటే మాత్రమే ఊపిరిపీల్చుకునే అవకాశం వస్తుందని ఆయన తెలిపారు. లేదంటే పెను ముప్పుని కోనసీమ ఎదుర్కోవాల్సి రావడం తథ్యం అన్నట్టుగా కనిపిస్తోందన్నారు.

వరదనీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పోలీసులు

అప్రమత్తంగా ఉన్నాం..

వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలకు అదనపు సిబ్బందిని కూడా తరలించి, ఏర్పాట్లు చేశామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

"వరద తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం వరకూ ఉంటుంది. అందుకు అనుగుణంగా అప్రమత్తమయ్యాం. ఏటిగట్లు బలహీనంగా ఉన్నట్టు సమాచారం అందిన ప్రతీ చోటకు మా బృందాలు వెళ్లాయి. అదనపు సిబ్బందితో పహారా కాస్తున్నాము. రాత్రికి కూడా గస్తీ ఉంటుంది. సమీప ప్రాంతాల వాసులను అప్రమత్తం చేశాము. అందరూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించాము. ఏటిగట్ల పరిరక్షణ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మొత్తం 12 చోట్ల ప్రమాదం పొంచి ఉందని గుర్తించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశాము. ప్రజల రక్షణకు పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ కాశీ విశ్వేశ్వర రావు తెలిపారు.

గత అనుభవాలను గమనంలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని, ఉపద్రవం నుంచి గట్టెక్కేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని ఆయన బీబీసీకి వివరించారు.

పీకల్లోతులో యానాం

ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన ప్రధానమైన మూడు పాయలు వశిష్ట, వైనతేయ, గౌతమీ నిండుకుండల్లా మారాయి. గట్టుతో సమానంగా గోదావరి పరుగులు పెడుతోంది. దాంతో లంక వాసులతో పాటుగా సమీప గ్రామాల ప్రజలను కూడా తరలించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా యంత్రాంగం పలువురిని ఇళ్ల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించింది.

ఏపీకి చెందిన 6 జిల్లాల్లోని 645 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానాం కూడా తీవ్రంగా తల్లడిల్లుతోంది. యానాంలో అనేక కాలనీలు జలమయమయ్యాయి. పీకల్లోతు నీటిలో కనిపిస్తున్నాయి. వందల ఇళ్లు నీటిపాలయ్యాయి. 3400 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు యానాం అధికారులు ప్రకటించారు.

ఏపీలో కూడా 70 మంది నిర్వాసితులు పునరావాస కేంద్రాల్లో ఉన్నట్టు విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. అంతేగాకుండా వరద బాధితులకు బియ్యం, పప్పులు, నూనె, ఉల్లిపాయలు వంటి నిత్యావసర సరుకుల పంపిణీ కూడా ప్రారంభించామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత బీబీసీకి తెలిపారు. బాధితులందరికీ సహాయం అందిస్తామని ఆమె తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అందరికీ సదుపాయాలు కల్పించామని వివరించారు.

భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి నదీ ప్రవాహం

అపార పంట, ఆస్తి నష్టం

గోదావరి వరదల కాలంలో గడిచిన మూడు రోజులుగా ఏపీలో ముగ్గురు మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ కారణాలతో వరదల్లో చిక్కుకుని మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడించింది.

అదే సమయంలో ఈ వరదల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో దాదాపుగా 3వేల హెక్టార్లకు పైబడి వ్యవసాయ పంటలు, మరో 2వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్టు శనివారం మధ్యాహ్నానికి గుర్తించారు.

ఆదివారం నాటికి ఈ వరదల మూలంగా ఏర్పడే నష్టం ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. వరదలు తగ్గుముఖంగా పట్టిన తర్వాత పూర్తిస్థాయి నష్టం అంచనాలు వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.

మరోవైపు రోడ్లు భవనాలు, విద్యుత్ శాఖలకు కూడా నష్టం వాటిల్లింది. వరదల్లో పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.

సుమారుగా వెయ్యికి పైగా ఇళ్లు పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ దెబ్బతిని ఉంటాయన్నది ప్రాధమిక అంచనాగా రెవెన్యూ శాఖ చెబుతోంది. మరో రెండు రోజుల తర్వాత అసలు నష్టం వెల్లడవుతుందని చెబుతున్నారు.

ఈ వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటామని ఇప్పటికీ సీఎం హామీ ఇచ్చారు. తక్షణ పరిహారం కింద ప్రతీ కుటుంబానికి రూ. 2వేల చొప్పున అందించాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లినప్పుడు వాటిని అందిస్తామని అధికారులు అంటున్నారు.

అటు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం డివిజన్ పరిధిలో కూడా ముంపు బెడద పెరుగుతోంది. ఇప్పటికే జిల్లాలోని 41 గ్రామాలు వరద నీటిలో నానుతున్నాయి. గోదావరిలో చేపల వేటకు వెళ్లే వారంతా అపారనష్టం చవిచూడాల్సి వచ్చిందని పాతనవరసపురం గ్రామానికి చెందిన ఎం అచ్యుత్ అన్నారు.

''వలలు కొట్టుకుపోయాయి. కొన్ని కట్లు కూడా దెబ్బతిన్నాయి. సముద్రంలోకి పోయాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఆరేడు లక్షలు నష్టపోయాము. వలకట్లు లాక్కుని, అన్నీ జాగ్రత్త పరుచుకునే అవకాశం లేకుండా పోయింది. అందువల్ల ఇబ్బంది పడుతున్నాం. మూడు నెలల వరకూ మాకు జీవనోపాధి కూడా కష్టమే. వరద తగ్గిపోయినా మాకు కట్లు కట్టుకునే అవకాశం లేకుండా పోయింది. మాకేమీ తోచడం లేదు’’ అని ఆయన బీబీసీతో అన్నారు.

నావలు దెబ్బతినడం, వల కట్లు కొట్టుకుపోయినందున ప్రభుత్వం సహాయం చేయాలని వారు కోరుతున్నారు.

గిరిజనులను ఆదుకోవాలి..

వరదల కాలంగా మూడు రోజులుగా కొండలపై తలదాచుకున్న పోలవరం ముంపు ప్రాంత గిరిజనులను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

"వరదల మూలంగా తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రభుత్వ ప్రకటనలకు ఆచరణకు పొంతన కనిపించడం లేదు. సహాయక చర్యలు అంతంతమాత్రంగా కనిపిస్తున్నాయి. కొండలపై తలదాచుకున్న గిరిజనుల కోసం హెలికాప్టర్లలో ఆహారం అందిస్తున్నప్పటికీ అది సరిపోవడం లేదు. వరద తగ్గుతున్నందున బోట్లు సహాయంతో ఆహారం, మంచినీరు సరఫరా చేయాలి. వరదలు తగ్గుతున్న ప్రాంతంలో జ్వరాలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ముందస్తు చర్యలకు పూనుకోవాలి " అని ఆయన డిమాండ్ చేశారు.

వరదల్లో నష్టపోయిన వారందరికీ తగిన పరిహారం అందించాలని, లేదంటే తమ పార్టీ ఆందోళనకు దిగుతుందని ఆయన బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Godavari Floods-Konaseema: There is a danger lurking in 12 places of Godavari Floods
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X