ప్రయాణికులకు గుడ్ న్యూస్: ఎయిర్‌పోర్ట్‌లో ఆ టెస్టులకు చెక్: కీలక నిర్ణయం
దుబాయ్ కి వెళ్లే ఇండియన్స్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుండి ఎయిర్ పోర్టులో ఆ టెస్ట్ లకు చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణానికి ముందు ఎయిర్ పోర్ట్ లో ఆర్టిపిసిఆర్ టెస్టులు ఇక అక్కరలేదని నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
యూఏఈ బయలుదేరేముందు భారతీయ ప్రయాణికులు విమానాశ్రయాలలో ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ చేయించుకోవాలనే నిబంధన ఉండేది. ఈ నిబంధనను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంగళవారం తొలగించింది. భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నుండి వచ్చే ప్రయాణీకుల కోసం దుబాయ్ విమానాశ్రయం ఈ నిబంధనను తొలగిస్తూ ఉత్తర్వులిచ్చింది. అంతేకాదు కొత్త నిబంధనలతో పాటు ఒక సలహాను జారీ చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు భారతీయులు షెడ్యూల్ చేయబడిన విమానం బయలుదేరడానికి 48 గంటల ముందు ఆమోదించబడిన ఆరోగ్య సేవా ప్రదాత నుండి తీసుకున్న కోవిడ్-19 పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. దుబాయ్ చేరుకున్న తర్వాత ప్రయాణికులు తప్పనిసరిగా పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ నిర్ణయం తీసుకుంది. యూఏఈ నిర్ణయంతో ఇప్పుడు దుబాయ్ కి వెళుతున్న భారతదేశ పౌరులకు కాస్త ఊరట లభించినట్లయింది. ప్రయాణీకులకు, తుది గమ్యస్థానంలో ప్రవేశించడానికి విధించిన నియమాలు వర్తిస్తాయి.
ప్రయాణ షరతులు నెరవేరేలా చూసుకోవాల్సిన బాధ్యత ఎయిర్‌లైన్ ఆపరేటర్లపై ఉంటుంది. ప్రయాణ నిబంధనలలో సవరణ వల్ల దుబాయ్ కి తరచుగా ప్రయాణించే పెద్ద సంఖ్యలో భారతీయుల ప్రయాణం సులభతరం అవుతుంది.
ఇదిలా ఉంటే భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఇటీవల రోజువారి కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఇరవై వేలకు తక్కువగానే కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితి ఉంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,102 కరోనా కేసులు నమోదయ్యాయి .కరోనా మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 278 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే 1697 కరోనా కేసులు పెరిగిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ దేశంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు కాస్త ఊరట ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉన్నట్టు కేంద్రం పేర్కొంది.












Click it and Unblock the Notifications