శుభవార్త.. ఎల్లుండి ఈ రూట్లలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న 4 వందేభారత్ రైళ్ళు!
భారతీయ రైల్వే తన రైల్వే సేవలను మెరుగుపరుస్తూ ఎప్పటికప్పుడు కొత్త రైళ్లను అందిస్తోంది. ముఖ్యంగా రైల్వేలో వందే భారత్ రైళ్లు కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి . దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా వందే భారత రైల్వే సేవలు కొనసాగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ కొత్త వందే భారత రైళ్ళను ప్రవేశ పెడుతూ భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తోంది.
నవంబర్ 8న పట్టాలెక్కనున్న వందే భారత్ రైళ్ళు
ఇదే క్రమంలో నవంబర్ 8వ తేదీన మరో నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించనుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధి చేసిన ఈ కొత్త సెమీ హై స్పీడ్ రైలు దేశంలో రైలు ప్రయాణంలో మరింత విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తాయని భావిస్తున్నారు.

ఈ మార్గాలలోనే వందే భారత్ కొత్త రైళ్ళ సేవలు
ఈ వందే భారత్ రైళ్లతో కలిపి మొత్తం దేశంలో వందే భారత్ రైలు సేవల సంఖ్య 164కి చేరుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న వందే భారత్ రైళ్ల వివరాలను చూసినట్లయితే బెనారస్- ఖజురహో, లక్నో- సహరాన్పూర్, ఫిరోజ్ పూర్ - ఢిల్లీ, ఎర్నాకులం - బెంగళూరు రైళ్లు 8వ తేదీనుండి ప్రజలకు సేవలను అందించనున్నాయి. ఈ కొత్త రైళ్లు ప్రధాన గమ్యస్థానాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని రైల్వే తెలుపుతోంది.
బెనారస్ - ఖజురహో వందే భారత్ రైలు
ఈ రైళ్లు అనేక పర్యాటక ప్రాంతాలను కలుపుతూ, దేశ పర్యాటక రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని కూడా పేర్కొంది. బెనారస్ - ఖజురహో వందే భారత్ రైలు ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న ప్రత్యేక రైళ్లతో పోలిస్తే దాదాపు 2 గంటల 40నిమిషాలను ఆదా చేస్తుంది. ఈ రైలు వారణాసి, ప్రయాగ్ రాజ్, చిత్రకూట్ మరియు ఖజురహో లతో భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన, మతపరమైన, సాంస్కృతిక గమ్య స్థానాలను కలుపుతుంది.
లక్నో- సహరాన్పూర్ వందే భారత్ రైలు
లక్నో- సహరాన్పూర్ వందే భారత్ రైలు దాదాపు 7.45నిమిషాలలో తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ రైలు లక్నో, సీతాపూర్, షాజహాన్పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నూర్, మరియు సహరాన్పూర్ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఈ రైలు వల్ల దాదాపు గంట ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
ఈ రెండు మార్గాలలోనూ కొత్త వందే భారత్
ఫిరోజ్ పూర్ - ఢిల్లీ వందే భారత రైలు తన ప్రాణాన్ని 6గంటల 40నిమిషాలలోనే పూర్తి చేస్తుంది. ఇది దేశ రాజధాని మరియు పంజాబ్లోని ఫిరోజ్ పూర్, బటిండా మరియు పాటియాలా వంటి కీలక నగరాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. ఎర్నాకులం- బెంగళూరు వందే భారత్ రైలు 8గంటల 40నిమిషాలలో తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ రైలు తన ప్రయాణ సమయాన్ని రెండు గంటలకు పైగా తగ్గిస్తుంది.
పర్యాటకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం
ఇది పర్యాటకులకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణం ఎంపికను అందిస్తుంది. ఈ మార్గం కేరళ, తమిళనాడు, మరియు కర్ణాటక మధ్య ఆర్థిక కార్యకలాపాలను పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ నాలుగు రైళ్ళను భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 8వ తేదీన ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications