గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కు ఝలక్; మూకుమ్మడిగా గూగుల్ ఉద్యోగుల బహిరంగలేఖ!!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పటివరకు 12,000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. సంస్థ భిన్నమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు చెయ్యనున్నట్టు జనవరి 20వ తేదీన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. సంస్థలోని ఆరు శాతం సిబ్బందిని తొలగించబోతున్నట్టు ఆయన వెల్లడించారు. దీంతో మొత్తంగా 12,000 మంది ఉద్యోగుల తొలగింపులు జరిగిపోయాయి.
ఈ క్రమంలో గూగుల్ ఉద్యోగులందరూ ఏకతాటి మీదికి వచ్చి ఉమ్మడిగా సీఈవో సుందర్ పిచాయ్ కు ఒక బహిరంగ లేఖ రాసి ఝలక్ ఇచ్చారు. అభద్రతాభావంలో ఉద్యోగులు పనిచేయలేరని, ఉద్యోగుల క్షేమం కోసం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు . 1400 మంది గూగుల్ ఉద్యోగులు మూకుమ్మడిగా రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకు ఆ లేఖలో వారు ఏమి ప్రస్తావించారు అంటే.. ఉద్యోగుల తొలగింపు విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, తొలగింపులు చేపట్టే ముందు వారికై వారు స్వచ్ఛందంగా రిజైన్ చేయడం కోసం అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం కొత్త నియామకాలను చేపట్టవద్దని ఉద్యోగుల తమ లేఖ ద్వారా డిమాండ్ చేశారు. యుద్ధాలు, ఇతర మానవ సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాలలో ఉద్యోగులను తొలగించకుండా ఉండాలని వారు లేఖ ద్వారా డిమాండ్ చేశారు. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే, వీసా సంబంధిత సమస్యలు ఎదుర్కొనే వారికి గూగుల్ సంస్థ ప్రత్యేకంగా సహాయం అందించాలని కూడా లేఖ ద్వారా వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో గూగుల్ చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఇప్పుడు ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

గూగుల్ సంస్థలో ఉద్యోగుల తొలగింపు తాలూకు ప్రతికూల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఉద్యోగులు, ఇప్పుడిప్పుడే ముకుమ్మడిగా సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ కు బహిరంగ లేఖ రాయడం, తొలగింపులకు పాల్పడుతున్న అన్ని సంస్థల్లోని ఉద్యోగులలో ఆసక్తిని రేకిస్తుంది. ఇప్పటికే గూగుల్ సంస్థతో పాటుగా మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి సంస్థలన్నీ ఉద్యోగుల తొలగింపును చేపట్టి నిర్దాక్షిణ్యంగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ సమయంలో గూగుల్ సంస్థ ఉద్యోగులు రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications