ప్రజలు చూస్తుండగానే మహిళా పోలీసుపై లైంగిక దాడి
భోపాల్: మహిళలకు రక్షణగా నియమించిన మహిళా పోలీసుపైనే ఓ దుండగుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రజలు చూస్తుండగానే ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఘటన జరిగిన స్థలం కూడా నిర్భయ పోలీసుల మొబైల్ యూనిట్‌కు 100 మీటర్ల దూరంలోనే కావడం గమనార్హం.
రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్భయ పోలీసు మొబైల్ యూనిట్‌ను ప్రారంభించారు. కాగా, ఇన్‌స్పెక్టర్ జనరల్ అజయ్ శర్మ కథనం ప్రకారం.. బాధిత మహిళా పోలీసు నిర్భయ యూనిట్‌లో పని చేస్తోంది. ఆమె రాత్రి 8గంటల ప్రాంతంలో డబ్బులు డ్రా చేసేందుకు ఏటిఎంలోకి వెళ్లింది.

ఆ సమయంలోనే రాజా మోహళ్లకు చెందిన రాజా తివారీ అనే వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనను అక్కడ ఉన్న ప్రజలు చూస్తున్నారు గానీ.. అడ్డుకునేందుకు ఎవరూ ప్రయత్నించకపోవడం విచారకరం. అయితే అక్కడికి చేరుకున్న మహిళా పోలీసు బంధువులు ఆమెను రక్షించారు. అనంతరం బాధిత మహిళా పోలీసు కానిస్టేబుల్ ఐజికి ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు మేరకు నిందితులు రాజా తివారీ, అతనికి సహకరించిన సచిన్ శర్మలపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, రాజా తివారీ ఓ గూండా అని, అతనిపై ఇప్పటికే 12 క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. అతను కొన్ని నెలల క్రిందే జిల్లాను విడిచిపెట్టి పారిపోయాడని తెలిపారు. రాజా తివారీ, శర్మల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications