Government Job: కరోనాతో మరణించాక డీఎస్‌పీ ఉద్యోగం వచ్చింది - ప్రెస్ రివ్యూ

కోవిడ్-19

కరోనాతో మరణించిన తర్వాత ఓ యువకుడికి డీఎస్‌పీ కొలువొచ్చిందని సాక్షి ఓ కథనం ప్రచురించింది.

''బిహార్‌కు చెందిన 30 ఏళ్ల అవినాష్‌కు చిన్నప్పటి నుంచి బిహార్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌లో(బీపీఎస్‌సీ) ఉద్యోగం సాధించాలని క‌ల ఉండేది.

దాని కోసం అవినాష్ క‌ష్టప‌డి చదివాడు. బీటెక్‌ పూర్తి చేసి భారీ మొత్తంలో ప్యాకేజీ ఉన్న ఇంజినీర్ ఉద్యోగాన్ని ప‌క్కన పెట్టి కోచింగ్ తీసుకొని మరీ ప‌రీక్షలు రాశాడు.

అయితే ప‌రీక్షలు రాసిన అనంతరం అవినాశ్ క‌రోనా బారిన ప‌డ్డాడు. కొన్నిరోజుల పాటు డాక్టర్ల సలహాలతో ట్రీట్‌మెంట్ తీసుకొని డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే, డిశ్చార్జ్ అనంతరం అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించ‌డంతో తిరిగి ఆసుప‌త్రిలో చేరాడు. ఈ క్రమంలో గత నెల(జూన్‌) 24న శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ మృత్యువాత పడ్డాడు.

అయితే, జూన్ 30 వ తేదీన బీహార్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ వెల్లడించిన ఫలితాల్లో అవినాశ్‌.. డిప్యూటీ కలెక్టర్‌(డీసీ) లేదా డిప్యూటీ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(డీఎస్‌పీ) స్థాయి ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిసింది.

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉద్యోగ ఫలాలు అనుభవించేందుకు తమ బిడ్డ లేడని గుండెలు పగిలేలా ఎడుస్తున్నారు.

ఇంజినీరింగ్‌లో స్టేట్‌ సెకెండ్‌ ర్యాంకర్‌ అయిన అవినాష్‌.. క్యాంపస్‌ సెలక్షన్‌లోనే భారీ ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ఎంపికైనట్లు బంధువులు వెల్లడించారు’’అని సాక్షి తెలిపింది.

సోనుసూద్‌ను కలవడానికి 800కి.మీ. సైకిల్ యాత్ర

సోనుసూద్‌ను కలిసేందుకు గతంలో ఒక యువకుడు పాదయాత్ర చేస్తే.. ఇప్పుడు మరో యువకుడు సైకిల్ యాత్ర చేపట్టాడని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

''సోనూసుద్‌ను కలిసి ఓ ఫోటో దిగితే చాలు అంటూ సైకిల్‌పై 800 వందల కిలోమీటర్ల దూరం ఉన్న ముంబయికి బయలుదేరాడు నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సురేశ్.

తన యాత్రలో భాగంగా గురువారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణానికి సురేశ్ చేరుకున్నాడు.

తలపై హెల్మెట్ ధరించి ఒక చిన్న బ్యాగు తీసుకుని రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు.

తన సోదరుడి సహకారంతో బయలుదేరిన తనకు మార్గం మధ్యలో సోనుసుద్ అభిమానులు కలిసి పండ్లు, బిస్కెట్లు, ఆహారం, నీళ్లు అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశాడు.

సోనుసూద్‌ నుంచి తాను ఏమీ ఆశించడంలేదని... ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభిమానిగా మారానని, కేవలం ఆయనపై తనకున్న అభిమానం వ్యక్తం చేస్తానని సురేశ్ చెప్పాడు’’అని వెలుగు తెలిపింది.

ప్రేమను నిరాకరించిందని గొంతులో పొడిచి.. చున్నీ బిగించి హత్య

తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిని ఆమె ఇంట్లోనే చంపిన యువకుడు తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

''నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పి.సుధాకర్‌, సరిత దంపతుల కుమార్తె తేజశ్వని ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతున్నారు. సుధాకర్‌ సహచర ఉద్యోగి అయిన కృష్ణయ్య కుమారుడు వెంకటేష్‌కు, తేజశ్వనికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

ఏడాదిగా వెంకటేష్‌ ప్రవర్తనతో విసిగిన తేజశ్వని.. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పారు. ఈ నేపథ్యంలో వెంకటేష్‌ను కృష్ణయ్య బెంగళూరు పంపారు.

కరోనా కారణంగా ఈ ఏడాది మొదట్లో వెంకటేష్‌ గూడూరు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ప్రేమపేరుతో యువతిని వేధించడం మొదలుపెట్టాడు.

తల్లిదండ్రులు ఉదయం బయటకు వెళ్లగా... ఇంట్లో తేజశ్వని, ఆమె తమ్ముడు కార్తిక్‌ ఉన్నారు. 11 గంటల సమయంలో వెంకటేష్‌, తన స్నేహితుడిని వెంటబెట్టుకుని తేజశ్వని ఉండే అపార్ట్‌మెంట్‌ దగ్గరకు వచ్చాడు.

తేజశ్వని ఉన్న గదిలోకి వెళ్లి తలుపు మూసి... పదునైన చాకుతో ఆమె గొంతులో పొడిచాడు. తర్వాత చున్నీని ఆమె మెడకు బిగించి, చంపాడు. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

పోలీసులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. తేజశ్వని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. వెంకటేష్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం నెల్లూరు తరలించారు’’అని ఈనాడు తెలిపింది.

పంది

పందుల వ్యాన్‎ను హైజాక్ చేసిన గుర్తుతెలియని వ్యకులు

సినీఫక్కీలో పందుల వ్యాన్‎ను గుర్తు తెలియని వ్యక్తులు హైజాక్ చేశారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

''విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పోలీస్ ఎస్కార్ట్ వాహనం ద్వారా పందులను వ్యాన్‎లో అధికారులు తరలిస్తున్నారు.

పోలీస్ ఎస్కార్ట్ వాహనం ఉన్నప్పటికీ వ్యాన్‎ను 20 మంది దుండగులు అడ్డగించారు. అనంతరం వ్యాన్‎లో ఉన్న డ్రైవర్‎ను బయటకు లాగేసి..వ్యాన్‎ను ఎత్తుకెళ్లారు.

పోలీసులు వెంబడిస్తున్నట్లు తెలుసుకున్న దుండగులు చిత్తూరు వరకు వ్యాన్‎ను తీసుకువెళ్లి అక్కడే వ్యాన్ వదిలి పరారయ్యారు.

సీసీటీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+