జయలలిత: అమ్మ కందిపప్పు కేజీ రూ. 110
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత ఆ రాష్ట్ర ప్రజలకు చల్లటి వార్త చెప్పారు. అమ్మ పథకంలో భాగంగా తమిళనాడు ప్రజలకు చౌకగా కందిపప్పు సరఫరా చెయ్యాలని నిర్ణయించామని జయలలిత స్పష్టం చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశంలో కందిపప్పు ధర పెరిగిపోయిందని గుర్తు చేశారు. కందిపప్పు ధరను నియత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఐదు వేల మెట్రిక్ టన్నుల కందిపప్పు దిగుమతి చేసుకుంటున్నదని అన్నారు.
దిగుమతి చేసుకున్న కందిపప్పు తమిళనాడు రాష్ట్ర అవసరాలకు 500 టన్నులు కేటాయించాలని కేంద్రానికి మనవి చేశామని, కేంద్రం మంజూరు చేసిందని అన్నారు. ఈ కందిపప్పు తమిళనాడులోని సహకార సూపర్ మార్కెట్లు, సహకార మండల దుకాణాల్లో విక్రయించడానికి ఏర్పాట్లు చేశామని అన్నారు.

నవంబర్ 1వ తేది నుంచి ఒక కేజీ కందిపప్పు ప్యాకెట్ రూ. 110, అర్ద కేజీ కందిపప్పు ప్యాకెట్ రూ. 55 విక్రయిస్తామని జయలలిత వివరించారు. దక్షిణ చెన్నై, మధురై, తిరుచ్చి, కోయంబత్తూరులోని సహకార సూపర్ మార్కెట్లలో విక్రయాలు ఉంటాయని అన్నారు.
అదే విధంగా అన్ని మండల సహకార దుకాణాల్లో కందిపప్పు విక్రయించడానికి అవకాశం కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో 91 సహకార స్టోర్లు, దుకాణాల్లో కందిపప్పు చౌకగా అందుబాటులోకి వస్తుందని తెలుసుకున్న అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్ లో కందిపప్పు కేజీ రూ. 200 నుంచి రూ.220 వరకు పలుకుతుంది. అసలే తమిళనాడులో ఇండ్లీ సాంబర్ కు పెట్టింది పేరు. కందిపప్పు లేకుండా సాంబారు చెయ్యడం సాధ్యంకాదు. హోటల్స్ లో ఇప్పుడు ఇడ్లీ సాంబారు ధరలు పెంచేశారు.












Click it and Unblock the Notifications