Kanda Express: 800 టన్నుల ఉల్లితో ఢిల్లీకి చేరిన స్పెషల్ ట్రైన్!
ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరిగిపోతూ సగటు మనిషి వంటింట్లో కన్నీళ్లు తెప్పిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో దాదాపు 59 శాతం వరకు పెరిగిన ఉల్లి ధరలకు బ్రేకులు వేసేందుకు రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని ప్రధాన ఉల్లి కేంద్రమైన నాశిక్ నుంచి దేశంలోని ప్రముఖ నగరాలకు ప్రత్యేకంగా 'కాందా ఎక్స్‌ప్రెస్' (Kanda Express) రైళ్లను పరుగులు పెట్టిస్తోంది. నాశిక్ నుంచి నేరుగా భారీ ఎత్తున ఉల్లిని రైళ్ల ద్వారా రవాణా చేసి, మార్కెట్లకు సరఫరా పెంచడం ద్వారా ధరలను అదుపులోకి తేవడానికి ప్రభుత్వం ఈ బిగ్ ప్లాన్ వేసింది.
పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ, చెన్నై, కొచ్చి, మదురై, గౌహతి వంటి ప్రధాన నగరాలకు ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా ఉల్లిని సరఫరా చేస్తున్నారు. నాశిక్‌లోని ప్రసిద్ధ నాపడ్ మార్కెట్ లాసల్‌గావ్ నుంచి తొలి విడతగా సుమారు 840 టన్నుల బఫర్ స్టాక్ ఉల్లిని ఢిల్లీకి తరలించారు. నేరుగా పెద్ద మార్కెట్లకు భారీ పరిమాణంలో ఉల్లి చేరుకోవడం వల్ల హోల్‌సేల్ ధరలు వెంటనే తగ్గుముఖం పడతాయని, ఆ తర్వాత రిటైల్ వ్యాపారుల వద్దకూ తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చి సామాన్యులకు ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

దేశంలో ఉల్లికి కొరత లేదన్న ప్రభుత్వం
ఒక్కసారిగా ధరలు పెరిగినప్పటికీ దేశంలో ఉల్లి నిల్వలకు ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది 2025-26 సీజన్‌లో దాదాపు 307 లక్షల టన్నుల ఉల్లి దిగుబడి వస్తుందని అంచనా వేసింది. ఇది క్రితం ఏడాది ఉత్పత్తి అయిన 308 లక్షల టన్నులకు దాదాపు సమానంగా ఉంది. అయితే పంట మార్పిడి, రవాణా ఆలస్యం వల్ల తాత్కాలికంగా ధరలు పెరిగాయని, ప్రభుత్వ వద్ద తగినంత బఫర్ స్టాక్ ఉన్నందున ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
సామాన్యులకు శీఘ్రమే ఉపశమనం!
'కాందా ఎక్స్‌ప్రెస్' ద్వారా నిరంతరంగా ఉల్లి లోడ్‌లను హోల్‌సేల్ మార్కెట్లకు తరలించడం ద్వారా సప్లై పెరిగి ధరలు అదుపులోకి వస్తాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా రాబోయే కొద్ది రోజుల్లోనే రిటైల్ మార్కెట్లలో ఉల్లి ధరలు సాధారణ స్థితికి వస్తాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ధరల మంటను తగ్గించేందుకు రైల్వేల ద్వారా ఈ తరహా ప్రత్యేక రవాణా చేయడం నిత్యావసర రంగానికి పెద్ద ఊరట నిచ్చే అంశంగా మారింది.














Click it and Unblock the Notifications