LPG: 24 దిగ్గజ కంపెనీలకు కేంద్రం బిగ్ టార్గెట్! ఏటా రెండుసార్లు..
దేశంలో వంటగ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా, గృహ అవసరాలకు డిమాండ్‌కు తగినట్లుగా సిలిండర్లు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లేందుకు ఏకంగా 24 ప్రముఖ చమురు శుద్ధి, ఉత్పత్తి సంస్థలకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. విదేశీ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులు వచ్చినా దేశంలో కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర పెట్రోలియం శాఖ ఈ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది.
రోజుకు 63.81 వేల మెట్రిక్ టన్నులు
కేంద్ర పెట్రోలియం , సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. దేశవ్యాప్తంగా రోజుకు మొత్తం 63.81 వేల మెట్రిక్ టన్నుల (KTPD) ఎల్పీజీని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని వినియోగంలోకి తేనున్నారు. ఇందులో 18 ప్రభుత్వ రంగ శుద్ధి కర్మాగారాలు, 3 ప్రైవేట్ సంస్థలు , 3 అప్‌స్ట్రీమ్ చమురు కంపెనీలు భాగస్వామ్యం కానున్నాయి. ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా రోజుకు 18 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో మొదటి స్థానంలో నిలవగా, బీపీసీఎల్ కొచ్చి రిఫైనరీ (4.80 KTPD), నాయారా ఎనర్జీ (4.48 KTPD) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు కంపెనీలే మొత్తం ఉత్పత్తిలో సింహభాగాన్ని అందించనున్నాయి.

చట్ట సవరణలతో సకల సౌకర్యాల ఏర్పాటుకు ఆదేశాలు!
పెట్రోలియం ఉత్పత్తుల నిర్వహణ ఉత్తర్వులు-1999కి అవసరమైన సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచడమే కాకుండా, సేకరించిన గ్యాస్‌ను సురక్షితంగా నిల్వ చేయడం, రవాణా చేయడం , పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను తక్షణమే అభివృద్ధి చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్, జాయింట్ వెంచర్ కంపెనీలను ఆదేశించింది.
అధునాతన టెక్నాలజీతో గరిష్ఠ ఉత్పత్తికి శ్రీకారం!
కేవలం పాత పద్ధతులకే పరిమితం కాకుండా, సరికొత్త సాంకేతికతను ఉపయోగించి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని స్పష్టం చేసింది. నాఫ్తాను ఎల్పీజీగా మార్చే ప్రాసెస్ , గ్యాసోలిన్ ఆధారిత కెటలిటిక్ క్రాకింగ్ యూనిట్లను అప్‌గ్రేడ్ చేయడం వంటి ఆర్థికంగా లాభదాయకమైన టెక్నాలజీలను వినియోగించుకోవాలని సూచించింది. అత్యవసర పరిస్థితులు లేదా ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా గ్యాస్ ఉత్పత్తిని తక్షణమే పెంచాలని కంపెనీలను ఆదేశించే సంపూర్ణ అధికారాలను కేంద్రం తన వద్దే ఉంచుకుంది.
ఏడాదికి రెండుసార్లు సమీక్ష.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
ఈ నూతన ఉత్పత్తి ప్రణాళికను ప్రతి ఏటా జనవరి 1 , జులై 1 తేదీల్లో ప్రభుత్వం సమీక్షిస్తుంది. కొత్తగా వచ్చే రిఫైనరీలు, సాంకేతిక మార్పులకు అనుగుణంగా లక్ష్యాలను అప్‌డేట్ చేస్తారు. ఈ నిబంధనల అమలు తీరును 'సెంటర్ ఫర్ హై టెక్నాలజీ' పర్యవేక్షిస్తుంది. ఒకవేళ ఏ కంపెనీ అయినా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే, నిత్యావసర వస్తువుల చట్టం-1955 ప్రకారం కఠినమైన శిక్షాత్మక చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.














Click it and Unblock the Notifications