శుభవార్త: జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్!
భారతదేశం తన సత్తా మరోమారు చాటింది. ప్రపంచంలోని అగ్ర దేశాలకు పోటీ ఇస్తూ భారత్ అన్ని రంగాలలోనూ దూసుకుపోతోంది. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టిన భారత్ ఇప్పుడు గర్వంగా అగ్రదేశాల చెంత నిలిచింది.
4ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ
నాలుగు ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ చేరుకోవడం ప్రతి ఒక్కరికి సంతోషం కలిగిస్తుంది. ఇప్పటివరకు 4వ స్థానంలో ఉన్న జపాన్ ను వెనక్కి నెట్టి భారత్ ఆ స్థానాన్ని దక్కించుకొని నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడం గర్వించదగ్గ అంశమని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఫీలవుతున్నారు. భారతదేశం ప్రపంచ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని నీతి అయోగ్ ప్రకటించింది.

నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
నీతి అయోగ్ సీఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యమ్ ఈ మేరకు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనకంటే అమెరికా, చైనా, జర్మనీలు మాత్రమే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని ఇప్పుడు మనం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రణాళికను కొనసాగిస్తూ ఇదే విధంగా రెండున్నర, మూడు ఏళ్లలోపు ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సత్తా చాటుతున్న భారత్
2010 సంవత్సరంలో భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో పదవ స్థానంలో ఉందని, 2019 నాటికి బ్రిటన్ వెనక్కి నెట్టి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆయన వెల్లడించారు. ఆరు సంవత్సరాల కాలంలో నాలుగు స్థానాలు పైకి ఎగబాకి భారత్ తన సత్తా చాటింది అని పేర్కొన్నారు.
శరవేగంగా భారత్ ఆర్ధిక అభివృద్ధి
2026 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ అంచనాలు దాదాపు 4187.017 డాలర్లకు చేరుకుంటుందని ఇప్పటికే immf వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ ఏప్రిల్ ఎడిషన్ నివేదిక ఒక అంచనా వేసింది. ఇక వచ్చే రెండేళ్లలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆ నివేదికలో పేర్కొంది. 2025 సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.2 శాతం 2026లో 6.3 శాతం వృద్ధి నమోదు చేస్తాయని అంచనా ఉంది.
జపాన్ ను ఓవర్ టేక్ చేసిన భారత్
భారత ఆర్థిక అభివృద్ధికి భారతదేశ జనాభా ఎంతగానో దోహదపడుతున్నట్టు నీతి అయోగ్ సీఈఓ వెల్లడించారు. వేగంగా అభివృద్ధి చెందే దేశంగా భారతదేశం మారిందని, 30 సంవత్సరాల కాలంలో భారత్ ఆర్థికంగా ప్రగతి సాధించడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి జపాన్ దేశాన్ని ఓవర్ టేక్ చేసి భారత్ శరవేగంగా దూసుకుపోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంతోషం కలిగిస్తుంది.












Click it and Unblock the Notifications